దొరికితేనే దొంగ..!

17-09-2026 | 05:05am
  1. వరుస చోరీలతో ప్రజల్లో భయం
  2. పోలీసులకు సవాల్‌గా మారిన ఘటనలు

బెజ్జూర్, సెప్టెంబరు 16 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల(Bejjur Mandal) కేంద్రంలో వరుస చోరీలు(Thefts) జరుగుతున్నప్పటికీ నిందితుల ఆచూకీ లభించకపోవడంతో ప్రజల్లో , వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల రాచకొండ స్వప్నిల్  కు చెందిన కిరాణా దుకాణం(Grocery store)లో చోరీ జరగడంతో మరోసారి భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్యాష్ కౌంటర్లో ఉంచిన సుమారు రూ.40 వేల నగదును దొంగలు అపహరించినట్లు వ్యాపారి స్వప్నిల్ తెలిపారు.

ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి డాగ్ స్క్వాడ్, ఫింగర్ప్రింట్, క్లూస్ టీమ్లను(Dog squad, fingerprint, clues teams) రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్తో ఆధారాల కోసం గాలింపు చేపట్టగా గోల్కొండ సమీపంలోకి వెళ్లిన అనంతరం డాగ్ ఆగిపోయినట్లు సమాచారం. క్లూస్ టీమ్ సిబ్బంది దుకాణంలో వేలిముద్రలను సేకరించారు. ఇప్పటివరకు ఏలాంటి వివరాలు కూడా వెల్లడించలేదు.

వరుస చోరీలతో భయం...

బెజ్జూర్ మండల కేంద్రంలో గత ఏడాది కాలంలో దీక్షిత ఫెర్టిలైజర్ షాప్ లో 2. లక్షల 40 వేలు,నరేష్ జువెలర్స్ అభరణాలు, రామయ్య సెల్ పాయింట్తో నగదు, ఆర్‌ఎంపీ డాక్టర్ సురేందర్కు చెందిన ద్విచక్ర వాహనం చోరీకి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు పలు ఘటనల్లో నిందితుల ఆచూకీ లభించకపోవడంతో ప్రజలు, వ్యాపారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 

దొరకకుండా దొంగ వింత ప్రయత్నం 

 పలు షాపుల్లో దొంగతనాలు చేసిన దొంగ ఏలాంటి ఆనవాళ్లు దొరకకుండా శరీరాన్ని పూర్తిగా కప్పుకొని చేతులకు సైతం బ్లౌజులు తొడిగి దొంగతనం చేసిన ప్రాంతాన్ని సైతం శుభ్రంగా తుడవడం అన్ని జాగ్రత్తలు తీసుకొని దొంగతనానికి పాల్పడుతున్నాడు అంటే దొంగ ప్రణాళిక తోటి దొంగతనం చేస్తున్నాడు అని తెలుస్తుంది. దొంగతనం చేసే ముందే ఆ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరమే దొంగతనానికి పాల్పడుతున్నట్లు పోలీసు వర్గాలు తెలుపుతున్నారు. లోకల్ వ్యక్తులతో చేతులు కలిపి బయట వ్యక్తులు వచ్చి దొంగతనం చేస్తున్నారా..? లేదా లోకల్ వ్యక్తులే దొంగతనం చేస్తున్నారా అనే విషయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

పెట్రోలింగ్‌పై ఆరోపణలు...

మండల కేంద్రంలో కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో పోలీసుల పెట్రోలింగ్ కనిపించడం లేదని స్థానికుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితిని దొంగలు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుస చోరీల నేపథ్యంలో రాత్రి గస్తీని మరింత పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

పనిచేయని సీసీ కెమెరాలు...

మండల కేంద్రంలో పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని కెమెరాలు పనిచేయకపోవడంతో నేరాల నియంత్రణలో అవి ఉపయోగపడటం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోతే వాటి ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి మండల కేంద్రంలోని ప్రతి ప్రధాన గల్లీ, వ్యాపార ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, పనిచేయని కెమెరాలను వెంటనే పునరుద్ధరించాలని ప్రజలు, వ్యాపారులు కోరుతున్నారు. రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్ను పెంచి వరుస చోరీలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు