7 March, 2026 | 10:21 PM

యువతే దేశ భవిష్యత్తు: అదనపు ఎస్పీ మహేందర్

07-03-2026 08:42 PM

మెదక్,(విజయక్రాంతి): దేశ భవిష్యత్తును నిర్మించే శక్తి యువతలోనే ఉందని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ అన్నారు. శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2026 కార్యక్రమంలో భాగంగా “50 Years of Emergency – Lessons for Indian Democracy” అంశంపై జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ మహేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి రాజ్యాంగ విలువలు, ప్రజల హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని సూచించారు. 1975లో అమలైన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టమని, ఆ కాలం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు అనేక పాఠాలు నేర్పిందన్నారు.

యువత దేశ చరిత్ర, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. యూత్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, వాక్చాతుర్యం, చర్చా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. సమాజ సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించే అవకాశాన్ని ఇలాంటి కార్యక్రమాలు కల్పిస్తాయని అన్నారు. భవిష్యత్తులో దేశ అభివృద్ధికి యువత చైతన్యంతో ముందుకు రావాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ వినియోగించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అలాగే యువత డ్రగ్స్ మరియు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఉస్సేన్, అధ్యాపకులు, విద్యార్థులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.