1 July, 2026 | 1:35 AM

108లో ఆక్సిజన్ లేక యువకుడి మృతి

01-07-2026 12:39 AM
  1. పీహెచ్‌సీలో పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు కల్పించాలి
  2. కుటుంబాన్ని ఆదుకోవాలని కోనరావుపేట గ్రామస్తుల డిమాండ్ 

కోనరావుపేట, జూన్ 30: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, 108 అంబులెన్సులో ఆక్సిజన్ సదుపాయం లేకపోవడంతో ఓ యువకుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపించారు. కోనరావుపేట గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన బొల్లె ప్రశాంత్(40) అనే యువకుడు చెప్పుల దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం అనారోగ్యానికి గురైన అతన్ని కుటుంబ సభ్యులు కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

అక్కడ వైద్యులు సురేష్ సిబ్బందితో కలిసి అత్యవసర చికిత్స అందిస్తూ సీపీఆర్ నిర్వహించినప్పటికీ, అవసరమైన స్థాయిలో ఆక్సిజన్ అందుబాటులో లేదని కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆరోపించారు. అంబులెన్స్‌లో సైతం ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడంతో వైద్యంలో తీవ్ర జాప్యం నెలకొందన్నారు. మెరుగైన చికిత్స కోసం తరలించే క్రమంలో అతను మృతిచెందాడని వాపోయారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న ప్రశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.