7 August, 2026 | 9:39 AM

విద్యుత్ తీగలను తాకిన ఇనుప పైపు.. అక్కడికక్కడే వ్యక్తి మృతి

07-08-2026 09:08 AM

నాగల్‌గిద్ద,(విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండలం కరముంగి గ్రామంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మీణికె బాబు (68) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం, మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో రేకుల ఇంటి పైకప్పును శుభ్రం చేసేందుకు ఇంటిపైకి ఎక్కిన మీణికె బాబు, చేతిలో పొడవైన ఇనుప పైపును పైకి ఎత్తే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అదుపు తప్పిన పైపు ఇంటి ముందు నుంచి వెళ్తున్న ఎల్‌టీ విద్యుత్ తీగలను తాకడంతో విద్యుత్ ప్రవహించి ఆయన తీవ్ర షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు మీణికె బాబు. ఆయనకు భార్యతో పాటు నలుగురు(4) కుమారులు, ముగ్గురు(3) కుమార్తెలు ఉన్నారు. వారందరికీ వివాహాలు జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.