1 September, 2026 | 2:30 AM

గాడి తప్పుతున్న యువత.. చెదిరిపోతున్న భవిత

01-09-2026 01:30 AM

తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం

జల్సాలకు అలవాటు పడి జీవితాలు ఛిద్రం

సులభ మార్గాల్లో డబ్బుల కోసం వెంపర్లాట 

అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ సంబంధాల మోజులో కటకటాల పాలు 

సంస్థాన్ నారాయణపూర్, ఆగస్టు 31: సంస్థాన్ నారాయణపూర్ మండల(Samsthan Narayanapur Mandal) కేంద్రంలో విచ్చలవిడి జల్సాలకు అలవాటు పడిన 11 మంది యువకులు పేకాట స్థావరం(Poker base)లో పట్టుబడి జైలు పాలయ్యారు. చౌటుప్పల్ మండలంలో పిన్ని వరుసయ్యే యువతితో అక్రమ సంబంధం పెట్టుకొని స్వంత చిన్నాన్న ని హత్య చేసి జైలు పాలయ్యాడు మరో యువకుడు. అప్పుల బాధ తట్టుకోలేక నారాయణపురం మండలం గుజ్జ గ్రామ పరిధిలో ఉరి వేసుకొని యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

దీంతో భార్య పిల్లలు రోడ్డున పడ్డారు.నూతన అవకాశాలను ఒడిసిపట్టి సమాజంలో అత్యున్నత స్థానంలో స్థిరపడాలని కలలు కంటూ వాటిని సాకారం చేసుకోవడం కోసం నిత్యం యుద్ధం చేస్తున్నారు యువతీ యువకులు. సమాజంలో మార్పుకు శ్రీకారం చుట్టేది కూడా నేటి యువతరమే.కానీ కొంతమంది యువకులు సమా జంలో మంచి మార్గం కాకుండా చెడు మార్గంలో పయనిస్తూ వారి జీవితాలను అంధకారంలోకి నెడుతున్నారు.

ఈజీ మనీకి అలవాటు పడి

కొంతమంది యువకులు విలాసవంతమైన జీవితం గడపాలని సులభంగా డబ్బు ను సంపాదించాలని తప్పుడు మార్గాల్లో పయనిస్తున్నారు. జల్సాలకు అలవాటు పడి తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారు.దీనికోసం బెట్టింగ్ పేకాట లాంటి వాటికి బానిసలుగా మారి జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు.

తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం

తమ పిల్లలు ఎలాంటి పనులు చేస్తున్నారు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు ఏమాత్రం ప ట్టించుకోవడం లేదు.ఉరుకుల పరుగుల జీవితంలో వారికి తమ పిల్లలను మంచి చెడు అడిగే సమయమే లేకుండా పోయిం ది. పల్లెటూర్లలో తమ పిల్లలు తప్పు చేస్తున్నారనే విషయం తొందరగా గమనించి వాడిని మా ర్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పట్టణాలలో మాత్రం ఇది ఆచరణ సాధ్యం కాని పని.

విద్యార్థి దశ నుండే చెడుతో సహవాసం 

సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉత్తమ జీవితాన్ని గడపడానికి విద్యార్థి దశనుండే స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకొని దానిని సాధించడానికి అలుపెరుగని పోరాటం చేస్తే తప్ప అనుకున్న లక్ష్యాలు సాధించడం నేటి సమాజంలో కష్టం. కానీ కొంతమంది విద్యార్థులు చెడు పట్ల ఆకర్షితులై పుస్తకాలకు బదులు మత్తు పదార్థాలకు బానిసలై కత్తులతో సావాసం చేస్తూ సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు.

యువకులలో మార్పు రావాలి

‘యువకుల ఆలోచనలో మార్పు రావాలి.మద్యానికి,మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు.తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తన పట్ల గమనిస్తూ ఉండాలి.చట్ట వ్యతిరేక పనులకు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.విద్యార్థి దశనుండే ఒక ఖచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేసుకొని అనుకున్న లక్ష్యాలను అందుకోవడానికి కృషి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి’.

  సీత పాండు,

 ఎస్సై నారాయణపురం