మోసపూరిత వాగ్దానాలపై యువత ప్రజా ఉద్యమాలు నిర్వహించాలి
- పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ రమేష్
గుండాల,(విజయక్రాంతి): యువత ప్రజా ఉద్యమాల్లోకి వచ్చి పాలకులు చేస్తున్న మోసపూరిత వాగ్దానాలపై ఉద్యమించాలని ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పర్శక రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు వాంకుడోత్ మోతిలాల్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని ముత్తాపురం గ్రామంలో జరిగిన పీవైఎల్ మండల ఆరవ మహాసభ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత దేశంలో 50% యువతీ, యువకులు ఉన్నారని, ఇందులో సగానికి పైగా యువతీ, యువకులు ఇంటర్మీడియట్, డిగ్రీ చదువులు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని వాపోయారు.
ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులగా హమాలి, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలలో కార్మికులుగా జీవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోధీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి యువకులకు అనేక వాగ్దానాలు చేసి గద్దెనెక్కారని, ఆ తర్వాత వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. ఈ పాలకవర్గ ప్రభుత్వాలు నిరుద్యోగ యువకుల పట్ల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా యువతీ, యువకులు పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం 17 మందితో కూడిన నూతన కమిటీని ఎన్నుకున్నారు.






