అలరించిన జిల్లాస్థాయి జానపద నృత్య పోటీలు
- అన్ని రంగాలలో విద్యార్థులు మక్కువ పెంచుకోవాలి
- ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి
గోవిందరావుపేట, అక్టోబర్ 28 (విజయక్రాంతి): జిల్లా విద్యాశాఖ పాపులేషన్ ఎడ్యుకేషనల్ సెల్ లో(Population Education Cell, Department of Education) భాగంగా జిల్లాస్థాయి జానపద నృత్య పోటీలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల గోవిందరావుపేట యందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుందూరు సోమారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్, ప్రభుత్వ, తెలంగాణ మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల నుండి విద్యార్థిని విద్యార్థులు పోటీలలో పాల్గొనగా ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ప్లానింగ్ కోఆర్డినేటర్ సైకం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక మండల విద్యాశాఖ అధికారి గొంది దివాకర్ పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా ప్లానింగ్ కోఆర్డినేటర్ సైకం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జానపద నృత్యాలు విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను సాంస్కృతిక కళల పట్ల వారి యొక్క ఆసక్తిని పెంపొందిస్తాయని వారు అన్నారు. మరో ముఖ్య అతిథి మండల విద్యాశాఖ అధికారి దివాకర్ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థులు ఆయా రంగాలలో మక్కువ పెంచుకొని సర్వతోముఖాభివృద్ధి సాధించాలని వారు అన్నారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుందూరు సోమారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నృత్య పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామన్నగూడెం విద్యార్థులు మొదటి స్థానంలో, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం తాడ్వాయి విద్యార్థులు రెండవ స్థానంలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సాపూర్ విద్యార్థులు మూడవ స్థానంలో నిలవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయనిర్మల హాజరుకాగా, న్యాయ నిర్ణయితలుగా ఎల్ నరసింహ, కోడి వెంకట్, భిక్షు రాథోడ్ వ్యవహరించగా జిల్లాలోని విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.