చెరువుల సంరక్షణ గాలికి..

06-11-2026 | 05:40am

ఒకవైపు ఆక్రమణలు.. మరోవైపు చెత్తాచెదారం 

పట్టించుకోని మున్సిపల్ నీటిపారుదల శాఖ అధికారులు 

నిర్మల్ నవంబర్ 5 (విజయక్రాంతి): నిమ్మల నాయుడు(Nimmala Naidu) కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువుల సంరక్షణ గాలికి వదిలేస్తున్నారు. చెరువులను పరిరక్షించి భూగర్భ జలాలను కాపాడవలసిన అధికారులే పట్టించుకోకపోవడంతో నిర్మల్ పట్టణంలో గొలుసుకట్టు చెరువు కథ ప్రశ్నార్థకంగా మారింది. నిర్మల్ పట్టణంలో నిర్మల్ పట్టణాన్ని పాలించిన నిమ్మల నాయుడు కాలంలో పట్టణంలో గొలుసు కట్టు చెరువులను నిర్మించారు. నిర్మల్ పట్టణంలో బంగాల్పేట్, వెంకటాద్రిపెట్, గొల్లపేట్, ఇబ్రహీం కుంట, కంచ రోడి కట్ట, మంజులాపూర్, గాజులపేట్, ధర్మసాగర్, పల్లె చెరువు తదితర చెరువులు నిర్మించారు. ఈ చెరువుల కింద పంటల సాగు, భూగర్భ జలాల పెంపుకు ఈ చెరువులను నిర్మించారు 

అసలే ఆక్రమణలు ఆపై చెత్త 

నిర్మల్ పట్టణం చుట్టూ ఉన్న చెరువులను ఇప్పటికే కొందరు ఆక్రమించుకున్నారు. ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్న భూములను ఆక్రమించుకున్న కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు అనేక ఫిర్యాదులు వచ్చాయి. చెరువు శిఖం భూముల్లో అక్రమ పట్టాలు సృష్టించి భూములను కబ్జా చేసిన కొందరు నేతలు మార్చి ఇతరులకు కూడా విక్రయించారు. దీంతో పట్టణం చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువుల విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.

ప్రధానంగా ధర్మసాగర్ కంచారోడికట్ట పల్లె చెరువు, వెంకటాద్రిపేట్ ఇబ్రహీం కుంట మందులాపూర్ చెరువులో ఇప్పటికీ అనేక అక్రమాలు జరిగినట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికి మున్సిపల్ నీటిపారుదల శాఖ అధికారులు అన్ని చెరువులను సర్వే చేసి శిఖం భూములను గుర్తించి సరిహద్దు రాళ్లు, ట్రెంచ్ ఏర్పాటు చేస్తున్న అక్రమాలు మాత్రం ఆగడం లేదు. చాలా చెరువుల్లో నిర్మల్ పట్టణంలోని ఆయా వార్డుల్లో ఉన్న చెత్తాచెదారం, కూలిపోయిన పాత ఇండ్ల మట్టి, సిమెంటు రాళ్లు, కుళ్ళిన పదార్థాలు, పనికిరాని వస్తువులు చెరువులో పోయడంతో చెరువులో నీరు దుర్గంధం చెందడమే కాకుండా చెరువు సికం తగ్గిపోతుంది. కొన్ని రోజులకు అక్కడ తాత్కాలిక షెడ్డులు ఏర్పాటు చేసుకొని ఆ భూమిని కబ్జా చేస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.

చెరువు భూములు చెత్త వేయకుండా కాపాడవలసిన మున్సిపల్ అధికారులు వాటి గురించి అసలు పట్టించుకోవడం లేదు. నీటిపారుదల శాఖ అధికారులు కూడా చెరువుల్లో మట్టి చెత్త తో నింపుతున్న అక్కడ కనీస చర్యలు తీసుకోవడం లేదు. దీంతో చెరువుల్లో నీటి సామర్థ్యం తగ్గి భూగర్భ జిల్లాల్లో సామర్థ్యం తగ్గుతుంది. నిర్మల్ పట్టణంలో భూములకు డిమాండ్ ఏర్పడ్డ నేపథ్యంలో చెరువులను కాపాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ కనీస చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. వ్యక్తిగత ఫిర్యాదులు వస్తే తప్ప అక్కడ అధికారులు వాటి జోలికి వెళ్లడం లేదు. ఇప్పటికీ చాలా చెరువుల్లో చెత్తాచెదారం నిండిపోవడంతో చేపల వృత్తి కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు నిర్మల్ పట్టణం చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువుల సంరక్షణపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు