11 ఏళ్లుగా నిరుపయోగంగా.. డబుల్ బెడ్రూం ఇళ్లు
- అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టుగా మారింది బోధన్ డబుల్ బెడ్ రూమ్ పరిస్థితి
- ఆవేదన వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు
- పెయింట్లు వేస్తూ వదిలేశారు
- పేదలకు మాత్రం అందని ఇళ్లు
- పాండు ఫారం వద్ద 555 ఇళ్లకు మోక్షం ఎప్పుడు?
బోధన్, అక్టోబర్ ౭(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని(Bodhan town) పాండుఫారం ప్రాంతం లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు(Double bedroom houses) సుమా రు 11 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉండటంపై పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, ఇప్పటివరకు అర్హులైన నిరుపేద కుటుంబాలకు కేటాయించకపోవడం చర్చనీయాంశంగా మారింది. పాండు ఫారం వద్ద మొత్తం 555 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారు.
ఒక్కో బ్లాక్లో మూడు అంతస్తుల చొప్పున, ప్రతి అంతస్తులో 12 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. ఇళ్లతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బాత్రూంలు, విద్యుత్ స్తంభాలు(CC roads, drainage systems, bathrooms, and electric poles) తదితర మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేశారు.ఇళ్లు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా వాటిని లబ్ధిదారులకు(Beneficiaries) అందించకపోవడంతో భవనాలు, పరిసర ప్రాంతాలు నిర్వహణ లేక దెబ్బతింటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు పలుమార్లు పెయింటింగ్ పనులు చేపట్టినా, ఇళ్ల కేటాయింపు మాత్రం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇళ్లను ఖాళీగా ఉంచడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బోధన్ పట్టణంలో సొంత ఇల్లు లేని అనేక నిరుపేద కుటుంబాలు అద్దె ఇళ్లలో జీవిస్తున్న నేపథ్యంలో, అండుఫారం డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులైన కుటుంబాలను గుర్తించి వెంటనే కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇళ్లకు సంబంధించిన మిగిలిన పనులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్య సమస్యలను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టి, లబ్ధిదారులకు ఇళ్లను అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 11 ఏళ్లుగా ఎదురుచూస్తున్న 555 కుటుంబాలకు ఇకనైనా సొంతింటి కల నెరవేరుతుందా? అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.