సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి

18-11-2026 | 08:52pm

డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి

బొల్లారం గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎల్లారెడ్డి డీఎస్పీ

యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలి

ఎల్లారెడ్డి డీఎస్పీ

 నాగిరెడ్డిపేట,నవంబర్ 18 (విజయక్రాంతి): మండలంలోని బొల్లారం గ్రామాన్ని(Bollaram village) సందర్శించి గ్రామ ప్రజలు,యువత మరియు గ్రామ పెద్దలకు సైబర్ నేరాలు(Cybercrimes), మాదకద్రవ్యాల వినియోగం(Drug use) వల్ల కలిగే అనర్థాలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్(DSP Srinivas) మాట్లాడుతూ...ప్రస్తుత సాంకేతిక యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులు,నకిలీ ఆన్‌లైన్ పెట్టుబడి మరియు డబ్బుల ఆశ చూపే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని,ఎవరికీ తమ బ్యాంకు వివరాలు, ఓటిపిలు,వ్యక్తిగత సమాచారాన్ని తెలియజేయకూడదని తెలిపారు.

అదేవిధంగా యువత మాదకద్రవ్యాలు, గంజాయి వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం మరియు సమాజ భవిష్యత్తును కూడా నాశనం చేస్తుందని వివరించారు.యువత తమ విలువైన సమయాన్ని విద్య, క్రీడలు, ఉద్యోగ సాధన మరియు సమాజ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.అలాగే గ్రామాల్లో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగం, అక్రమ ఆన్‌లైన్ గేమింగ్ మరియు జూద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు పోలీస్ శాఖకు సహకరిస్తూ గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు భాగస్వాములు కావాలని కోరారు. ప్రజలు మరియు పోలీసుల మధ్య సమన్వయం ఉన్నప్పుడే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బొల్లారం గ్రామ సర్పంచ్ ప్రభు గౌడ్,ఉపసర్పంచ్ స్వరూప, గ్రామ పోలీస్ అధికారి సందీప్ మరియు గ్రామ ప్రజలు, యువత, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు