ఉద్యాన పంటల సాగు ద్వారా రైతులకు నిరంతర ఆదాయం
*ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు..
ఉట్నూర్, నవంబర్ 18( విజయక్రాంతి ): రైతులు(Farmers) నిరంతరం కూరగాయల తో పాటు ఉద్యాన పంటలు సాగు(Horticultural crops) చేయడంతో నిరంతరం ఆదాయం వస్తుందని ఐటిడిఏ పిఓ మంద మకరందు(ITDA PO Manda Nekrandu) అన్నారు. బుధవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు.. ఆదిలాబాద్ పట్టణ కేంద్రం లో గల ఉద్యానశాఖ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా ఆయన క్షేత్రంలో ఏర్పాటు చేసిన షేడ్ నెట్, నెట్ హౌస్ లను పరిశీలించారు. షేడ్ నెట్ కింద సాగు చేస్తున్న మునగ, వెదురు, కరోండా మరియు డ్రాగన్ ఫ్రూట్ మొక్కల(Dragon fruit plants) పెరుగుదలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఐటీడీఏ ద్వారా గ్రామీణ అభివృద్ధి శాఖ, ఉద్యాన శాఖ ల సమన్వయం తో గిరిజన రైతులకు షేడ్ నెట్ లు ఇవ్వటానికి ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా ఉద్యానవన అధికారి గుడిమల్ల సందీప్ కుమార్ కు సూచించారు. అనంతరం మామిడి తోటలో అంతర పంటగా సాగు చేస్తున్న టమాటా పంటను పరిశీలించారు. మామిడిలో అంతర పంటగా టమాటా సాగు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన అధికారి గుడిమల్ల సందీప్ కుమార్ క్షేత్రంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి ప్రాజెక్టు అధికారి గారికి వివరించారు. క్షేత్రంలో చేపడుతున్న వివిధ ప్రదర్శనలు, నూతన పంటల సాగు విధానాల గురించి తెలియజేశారు. జిల్లాలో అనువైన పంటలు, వాటి సాగు విధానాల గురించి సందీప్ కుమార్ ని అడిగి తెలుసుకున్నారు. ఐటీడీఏ ఉట్నూర్ మరియు ఉద్యాన శాఖ సమన్వయం తో గిరిజన రైతులకు ఉపయోగపడే వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేయటానికి కృషి చేయాలనీ సూచించారు.
నర్సరీ లో రైతులకోసం, శిక్షణా కార్యక్రమాల కోసం ఉద్యాన నర్సరీ లో పామాయిల్, పండ్ల తోటల సాగు చేపడుతున్నట్లు, వాటితో పాటు క్షేత్రంలో చేపడుతున్న కార్యక్రమాల పట్ల ప్రాజెక్టు అధికారి సంతోషం వ్యక్తం చేశారు. ఎల్-నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆయిల్ పామ్, కూరగాయలు, మల్బరీ తదితర పంటలు సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం ఇచ్చే పంటల వైపు రైతులను మళ్లించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారిణి అలేఖ్య, సిబ్బంది పాల్గొన్నారు.