అధికారుల నిర్లక్ష్యం.. పంటకు ప్రాణం.!
- వృధాగా లక్షల లీటర్ల మిషన్ భగీరథ నీరు.
- తాగునీటికి ఎదురవుతున్న కష్టాలు.
నాగర్ కర్నూల్ నవంబర్ 18 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆర్డబ్ల్యూఎస్(RWS) ( మిషన్ భగీరథ) అధికారుల నిర్లక్ష్యం కారణంగా పైపులైన్ లీకేజీ కొనసాగడంతో దగ్గరలో ఉన్న ఓ రైతు వరి పంటను సాగు చేస్తున్నాడు. నాగర్ కర్నూల్ పట్టణంలోని సరస్వతి ఆలయం(Saraswati Temple) ముందర, మంతటి చౌరస్తా పరిధిలో రెండు చోట్ల నిత్యం వేల లీటర్లు మిషన్ భగీరథ తాగునీరు లీకేజీ కారణంగా వృధాగా పారుతుంది.
ఈ విషయంపై స్థానికులు రైతులు ప్రజా ప్రతినిధులు సైతం పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో ఈ లీకేజీ నీటిని అక్కడి రైతులు తమ పంట పొలాలకు వాడుకుంటున్నారు. కానీ లీకేజీ కారణంగా అక్కడ మురుగు చేరి మంచి నీరు కలుషితం అవుతున్నాయని అయినా మున్సిపల్,
మిషన్ భగీరథ అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదని స్థానికులు మండి పడుతున్నారు. ఎల్నీనో కారణంగా బొట్టు బొట్టు నీటిని ఒడిసి పట్టాలని పదేపదే ప్రజలకు చెప్పడమే కానీ అధికారులు వాటిని పాటించడం లేదని జనం మండి పడుతున్నారు.