ప్రారంభమైన దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర
చక్రేశ్వరాలయం నుంచి అంగరంగ వైభవంగా ఊరేగింపు
బోధన్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలో దుర్గామాత నిమజ్జన(Durga Mata Immersion) శోభాయాత్ర గురువారం వైభవంగా ప్రారంభమైంది. పట్టణంలోని చక్రేశ్వరాలయం నుంచి సార్వజనిక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శోభాయాత్రను మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మా శరత్‌రెడ్డి, సార్వజనిక్ కమిటీ అధ్యక్షుడు గమరపేట శ్రీను, ప్రధాన కార్యదర్శి గంగాధర్, కోశాధికారి హరికాంత్ చారి, అధికారులు, నాయకులు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా దుర్గామాతను పూలతో ప్రత్యేకంగా అలంకరించి, అందంగా ముస్తాబు చేసిన రథంపై ప్రతిష్ఠించి శోభాయాత్రను నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ, జై దుర్గామాత నినాదాలతో శోభాయాత్రలో పాల్గొన్నారు. దుర్గామాత నిమజ్జన శోభాయాత్రతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సార్వజనిక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.