రీ సర్వేలో రైతుల అభ్యంతరాలు పరిష్కరించాలి

28-11-2026 | 05:20pm

రైతుల అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాతే ఆన్‌లైన్‌లో వివరాల నమోదు 

వారం రోజుల్లో రీ సర్వేకు సంబంధించిన రికార్డు పనులు పూర్తి చేయాలి

రెబ్బల్ దేవ్ పల్లి గ్రామంలో రీ సర్వేపై గ్రామసభలో పాల్గొని, నర్సాపూర్ గ్రామంలో కొనసాగుతున్న సర్వే పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష 

సుల్తానాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): భూముల రీ సర్వే(Re-survey of lands) ప్రక్రియలో రైతుల(Farmers') నుంచి వచ్చిన అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి పరిష్కరించిన తర్వాతే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sriharsha) అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్  కోయ శ్రీహర్ష సుల్తానాబాద్ మండలం రెబ్బల్ దేవ్ పల్లి గ్రామంలో భూముల రీ సర్వే ప్రక్రియపై నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. అనంతరం ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలోపరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ రెబ్బల్ దేవ్ పల్లి గ్రామంలో భూముల రీ సర్వే ప్రక్రియ పూర్తయినందున రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. రైతులు లేవనెత్తిన ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత భూముల రికార్డులు, సర్వే వివరాలను సరిపోల్చి చూడాలని ఆదేశించారు.రైతుల అభ్యంతరాలను పూర్తిస్థాయిలో పరిష్కరించిన తర్వాతే భూములకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.

భూముల విస్తీర్ణం, సరిహద్దులు, హక్కులకు సంబంధించిన వివరాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు తమ భూములకు సంబంధించిన వివరాలపై పూర్తి స్పష్టత కల్పించాలని, వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని సూచించారు.రీ సర్వే ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, రైతుల సమక్షంలోనే భూముల వివరాలను పరిశీలించి నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో భూ సంబంధిత వివాదాలకు అవకాశం లేకుండా రికార్డులను పక్కాగా రూపొందించాలని తెలిపారు.

రీ సర్వే పనులను నాణ్యతతో పూర్తి చేయాలి

అనంతరం ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను  పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే పనుల పురోగతి, క్షేత్రస్థాయి పరిశీలన, రికార్డుల నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.భూముల రీ సర్వే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో భూముల కొలతలు, సరిహద్దులను క్షుణ్ణంగా పరిశీలించాలని, అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డులతో సర్వే వివరాలను సరిపోల్చుకోవాలని సూచించారు.

సర్వేకు సంబంధించిన రికార్డుల పరిశీలన, నమోదు తదితర పనులను వేగవంతం చేసి వారం రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతుల నుంచి అవసరమైన వివరాలను సేకరించి, వారి అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు.

రీ సర్వే ప్రక్రియలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి గ్రామంలో భూములకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పారదర్శకంగా రీ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని  ఆదేశించారు.ఈకార్యక్రమాల్లో ఏడీ ల్యాండ్ రికార్డ్స్ సోమేశ్వర్, తహసీల్దార్  లు భషిరోద్దిన్,యాకన్న ,రైతులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు