సూపర్‌ ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనేందుకు సమష్టి కార్యాచరణ

28-10-2026 | 04:22pm
  1. యాసంగిలో వరి సాగు తగ్గించాలి.. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి
  2. ఏడాది పాటు తాగునీటికి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు
  3. పెద్దపల్లిలో అధికారులతో సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

పెద్దపల్లి, అక్టోబర్ 28(విజయ క్రాంతి): సూపర్‌ ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో యాసంగిలో వరి సాగును తగ్గించి, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు.

బుధవారం పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్‌తో కలిసి మంత్రి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు నష్టం కలగకుండా అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. మొక్కజొన్న, శనగ, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

ఏడాది పాటు తాగునీటికి ఇబ్బందులు ఉండొద్దు

జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలకు వచ్చే ఏడాది పాటు నిరంతర తాగునీటి సరఫరా జరిగేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. నీటి వృథాను అరికట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రధానమంత్రి సూర్య ఘర్‌ పథకం ద్వారా సౌర విద్యుత్ వినియోగాన్ని విస్తృతం చేయాలని తెలిపారు. ప్రజాప్రతినిధులు తమ ఇళ్లపై సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఆదర్శంగా నిలవాలని కోరారు.

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసి పారదర్శకంగా ధాన్యం సేకరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విప్ విజయ రమణారావు మాట్లాడుతూ యాసంగిలో వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకు రోజుకు 12 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోందని తెలిపారు.

కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు జిల్లాలో 863 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, సాధారణంతో పోలిస్తే ఎనిమిది శాతం లోటు ఉందని తెలిపారు. అక్టోబర్‌లో ఇప్పటివరకు ఒక్క మిల్లీమీటరు వర్షం కూడా నమోదు కాలేదన్నారు. భూగర్భ జలమట్టం గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే 1.41 మీటర్ల మేర తగ్గిందని వివరించారు.

జిల్లాలో 311 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2,75,316 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎల్లంపల్లి జలాశయంలో 17.62 టీఎంసీల నీరు నిల్వ ఉందని, జిల్లాకు ఏడాదికి 1.85 టీఎంసీల నీరు అవసరమవుతుందని పేర్కొన్నారు.

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ భవిష్యత్తులో తాగునీటి కొరత తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అనంతరం వానకాలం వరి మద్దతు ధర, ఏడు సన్న రకాల ధాన్యానికి క్వింటాలుకు అదనంగా రూ.500 చెల్లింపు, సీతమ్మలోది ట్రెక్కింగ్‌ కార్యక్రమాలకు సంబంధించిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు