బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు చోరీ

27-11-2026 | 05:05pm
  1. పాల్పడిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు.
  2. 10 గ్రాముల బంగారు గొలుసు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ స్వాధీనం
  3. వివరాలు వెల్లడించిన వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు.

కోనరావుపేట, నవంబర్ 27 (విజయక్రాంతి): ఆన్‌లైన్ బెట్టింగ్‌కు(Online betting) బానిసై, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ యువకుడు అప్పులు తీర్చేందుకు వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును చోరీ చేసిన ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి చోరీ చేసిన 10 గ్రాముల బంగారు గొలుసుతో పాటు ఒక ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.

కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన ముష్ణం వెంకటేష్ (29), తండ్రి అంజయ్య, హైదరాబాద్‌లో ఐటీఐ పూర్తి చేసి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో అతడు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. మొదట కొంత డబ్బు గెలిచినప్పటికీ, ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు.

దీంతో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చి ఇక్కడే నివసిస్తున్నాడు.స్వగ్రామానికి వచ్చిన తర్వాత కూడా బెట్టింగ్ వ్యసనాన్ని కొనసాగించిన వెంకటేష్, తన భార్య బంగారు నగలను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులను సైతం బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా తెలిసిన వారి వద్ద అబద్ధాలు చెప్పి అప్పులు తీసుకొని, ఆ డబ్బులను కూడా బెట్టింగ్‌లో నష్టపోయాడు.

ఈ నేపథ్యంలో పోగొట్టుకున్న డబ్బులను తిరిగి సంపాదించాలనే ఉద్దేశంతో చోరీకి పాల్పడాలని నిర్ణయించుకున్నాడు.తన బంధువైన కోదురుపాక గ్రామానికి చెందిన బొంగొని రాజవ్వ ఇంట్లో ఒంటరిగా ఉంటుందని, ఆమె మెడలో బంగారు గొలుసు ఉందని తెలుసుకున్న వెంకటేష్ చోరీకి పథకం వేశాడు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం తన పల్సర్ బైక్‌పై కోదురుపాకకు చేరుకున్నాడు.

ముందస్తు ప్రణాళిక ప్రకారం మంకీ క్యాప్ ధరించి రాజవ్వ ఇంట్లోకి ప్రవేశించాడు. గుర్తుపట్టకుండా ఉండేందుకు వెంటనే ఇంట్లో లైట్ ఆఫ్ చేసి, ఆమె నోటికి తువ్వాలు అడ్డుపెట్టి బెదిరించాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు.ఈ ఘటనపై రాజవ్వ కుమారుడు లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయినపల్లి ఎస్‌ఐ రమాకాంత్ కేసు నమోదు చేశారు.

వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టి సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించారు.ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో కోదురుపాక ఎక్స్‌రోడ్ వద్ద వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి వద్ద నుంచి చోరీ చేసిన 10 గ్రాముల బంగారు గొలుసు, ఒక ద్విచక్ర వాహనం,

మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని, అతడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, అప్పుల ఊబిలో కూరుకుపోయి నేరాలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని డీఎస్పీ పేర్కొన్నారు. యువత ఆన్‌లైన్ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని,

సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో తమ జీవితాలను నేరాల వైపు మళ్లించుకోవద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, బోయినపల్లి ఎస్‌ఐ రమాకాంత్, సిబ్బంది ధర్మతేజ, కాశిం, శ్రీధర్, యాకుబ్‌లను డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు.

మరిన్ని వార్తలు