నేడు అమిత్ షా రాక
- హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్రకు హాజరుకానున్న కేంద్ర హోంమంత్రి
- పాల్గొననున్న కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, నేతలు
- నిజాం కాలేజీ నుంచి మొజాంజాహి మార్కెట్ చౌరస్తా వరకు యాత్ర
నవంబర్ 1 (విజయక్రాంతి): కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు నేతృత్వంలో జరిగే మహాపాదయాత్రలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. నిజాం కాలేజీ వద్ద ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ప్రారంభమై మొజాంజాహి మార్కెట్ చౌరస్తా వరకు ఈ యాత్ర కొనసాగనుంది.
సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌కు వెళ్లి 3 గంటల వరకు లంచ్ బ్రేక్ తీసుకుంటారు. అనంతరం నిజాం కాలేజీ వద్ద జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించి పాదయాత్రలో పాల్గొంటారు. అక్కడి నుంచి మొజాంజాహి మార్కెట్ చౌరస్తాకు చేరుకుని, సభలో మాట్లాడుతారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.
భారీ ఏర్పాట్లు
‘సర్’పై కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో కౌంటర్‌గా దేశవ్యాప్తంగా పాదయాత్రలను చేపట్టాలని బీజేపీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో చేపట్టే పాదయాత్రలో అమిత్ షా పాల్గొననున్నారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రులు జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు,- బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పార్టీ ఎంపీలు ఈటల రాజేందర్,
డీకే అరుణ, ఎం రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేష్, అర్వింద్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు అందరూ ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు. ఏకంగా ఈ పాదయాత్రలో అమిత్ షానే పాల్గొనడంతో భారీగా జనసమీకరణను చేపడుతున్నారు. వేలాదిగా పార్టీ శ్రేణులు, ప్రజలు, మేధావులు, విద్యావంతులు ఈ పాదయాత్రలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాదయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
అమిత్ షా ఏం మాట్లాడనున్నారు?
మొదట ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి యాత్ర చేయాలనుకున్నా.. ప్రజల మధ్య నుంచి యాత్ర సాగాలన్న అధిష్టానం సూచనతో రూట్ మార్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్, ఇండీ కూటమి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని కమలనాథులు ఆరోపిస్తున్నారు.
ఆదివారం ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో ‘ఓటు బచావో దేశ్ బచావో’ పేరుతో నిరసన చేపట్టింది. దీనికి కౌంటర్‌గా దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. దేశంలో చట్టబద్ధంగానే ‘సర్’ ప్రక్రియ జరుగుతున్నదని.. డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు, రోహింగ్యాల ఓట్లు, అర్హతలేని ఓట్లను గుర్తించి తొలగించడమే సర్ లక్ష్యమని బీజేపీ చెప్తున్నది.
అయితే ఈ అంశంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ప్రజల్లోకి వెళ్లి తిప్పికొట్టాలన్నది బీజేపీ వ్యూ హం. అంతేకాదు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై, బీఆర్‌ఎస్ తీరుపై కూడా అమిత్ షా విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది. ఈ సభలో అమిత్‌షా ఏం మాట్లాడుతారనే దానిపై ఆసక్తి నెలకొంది.