ప్రజల ఆస్తులపై రహస్యాలెందుకు?

10-10-2026 | 05:30am
  1. స్వతంత్ర విచారణకు ముందుకు రావాలి
  2. ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపం
  3. రూ. 10వేల కోట్లకు 817 ఎకరాల భూములను తనఖా
  4. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి 
  5. బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్

అక్టోబర్ 9 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రజల ఆస్తులు ఏ ఒక్క కుటుంబానికో, వ్యక్తులకో చెందినవి కావని, అవి రాష్ట్ర ప్రజలందరికీ చెందినవని, ప్రజల ఆస్తులపై రహస్య లావాదేవీలెందుకని బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్(BRS Official Spokesperson Manne Krishank) ప్రశ్నించారు. ప్రభుత్వ భూములపై జరుగుతున్న లావాదేవీలకు సంబంధించి అన్ని పత్రాలను బహిర్గతం చేసి, అవసరమైతే స్వతంత్ర విచారణకు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు.

తాము వ్యక్తిగత రాజకీయాల కోసం ప్రశ్నించడం లేదని, రాష్ట్ర సంపదను కాపాడాలనే ఉద్దేశంతోనే ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆస్తుల విషయంలో పారదర్శకత ఉండాలని, ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, బెదిరింపులకు పాల్పడినా ప్రజల ఆస్తుల గురించి ప్రశ్నించడం ఆపబోమని, ఏం పీక్కుంటరో పీక్కోండి.. భయపడదే లేదని వ్యాఖ్యానించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో క్రిశాంక్ మాట్లాడారు. 

రాష్ట్ర ప్రజల ఆస్తులకు కస్టోడియన్‌గా ఉండాల్సిన రేవంత్ రెడ్డి, రాష్ట్ర సంపదను కాపాడాల్సింది పోయి దాని విలువను తగ్గిస్తూ, తన కుటుంబ సభ్యులు, సన్నిహిత సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌లోని విలువైన ప్రభుత్వ భూములను తనఖా పెట్టి సుమారు రూ.10,000 కోట్లు సమీకరించిన వ్యవహారంపై ముఖ్యమంత్రి వెంటనే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

హైదరాబాద్ నగరంలో 817 ఎకరాల భూములకు సంబంధించిన లావాదేవీలు, వాటి విలువ నిర్ధారణ, తనఖా ఒప్పందాల వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని కోరారు. హైటెక్ సిటీ, మియాపూర్, శంకర్‌పల్లి, పటాన్‌చెరు, హయత్‌నగర్, జవహర్‌నగర్ తదితర ప్రాంతాల్లోని భూములకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అనేక ప్రశ్నలు ఉన్నాయని తెలిపారు.

హైదరాబాద్‌లోని అత్యంత విలువైన ప్రాంతాల్లో ఉన్న భూముల విలువను కేవలం ఎకరాకు సుమారు రూ.15 కోట్లుగా లెక్కించడం ఎలా సమంజసమని ప్రశ్నించారు. తమ వద్ద ఉన్న పత్రాల ప్రకారం, ఈ భూముల మార్కెట్ విలువను సుమారు రూ.12,818.63 కోట్లుగా చూపించినట్లు పేర్కొంటూ, వాస్తవ మార్కెట్ విలువతో పోలిస్తే ఈ విలువ నిర్ధారణ సరైనదేనా అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రజల ఆస్తులను ప్రజలకు తెలియకుండా తనఖా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ భూముల విలువ ఎంత? ఎంత మొత్తాన్ని సమీకరించారు? ఆ నిధులను ఏ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారు? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మెడికవర్ ఆసుపత్రుల ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం, ఆ సంస్థలకు ప్రచారం కల్పించిన తీరుపై గతంలో ప్రశ్నించినా సమాధానం రాలేదని అన్నారు.

సీఎం కుమార్తె నైమిషారెడ్డికి సంబంధించినదిగా పేర్కొంటున్న మైండ్ వాల్ట్ సంస్థ, సీఎం అల్లుడు గొలుగూరి సత్యనారాయణకు సంబంధించినదిగా పేర్కొంటున్న మ్యాక్స్ బీయన్ ఫార్మా సంస్థల్లోని డైరెక్టర్ల వివరాలపై కూడా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సంస్థలు, వాటి డైరెక్టర్ల మధ్య సంబంధాలు ఏమిటి? ప్రభుత్వ విధాన నిర్ణయాలతో వాటికి ఏమైనా ప్రయోజనాలున్నాయా? సీఎం కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపార ప్రయోజనాల విషయంలో ప్రయోజనాల సంఘర్షణ ఉందా? అన్న అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో విద్యార్థులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాతే ఆ వ్యవహారం జాతీయస్థాయిలో చర్చకు వచ్చిందని క్రిశాంక్ గుర్తుచేశారు. ప్రభుత్వ భూముల విషయంలో పారదర్శకంగా ఉండాలని, భూముల వివరాలు వెల్లడించకుండా లావాదేవీలు జరగకూడదని పేర్కొన్నారు. 


మరిన్ని వార్తలు