ఫైలుకో రేటు.. పనికో బేరం!

08-10-2026 | 05:10am
  1. అటెండర్ నుంచి అడిషనల్ కలెక్టర్ వరకు ఏసీబీ వలలో.. 
  2. రంగారెడ్డి జిల్లా అధికారులకు లంచాల రోగం
  3. ఏసీబీ అరెస్టులను లైట్ తీసుకుంటున్న అధికారులు 
  4. కలెక్టర్ దృష్టిసారించాలని కోరుతున్న జిల్లా ప్రజలు

రంగారెడ్డి బ్యూరో, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : ఫైలుకో రేటు.. పనికో బేరం అనే చందంగా రంగారెడ్డి జిల్లాలో(Ranga Reddy District) అవినీతి రాజ్యమేలుతున్నది. లంచావతారులు సామాన్యు లను జలగల్లా పీల్చుతున్నారు.  రోజుకో శాఖ.. వారానికో అధికారి ఏసీబీ వలలో చిక్కుతున్నాడు. వరుస ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. జిల్లా పరువును గంగలో కలుపుతున్నారనే అపవాదు ఉంది. చిన్న ఉద్యోగి స్థాయి నుంచి మొదలుకుని ఐఏఎస్ కేడర్(IAS Cadre) బాధ్యతల్లో ఉండే ఉన్నతాధికారుల వరకు లంచాల మరిగి అడ్డంగా బుక్కవుతుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో పంచాయతీ కార్యదర్శి(Panchayat Secretary) స్థాయి నుంచి కీలక శాఖల ఉన్నతాధికారుల వరకు లంచాల వ్యవహారం నిత్యకృత్యమైంది. అధికారులు మారినా అవినీతి తీరు మారడం లేదు. భూముల ప్రక్షాళన, డిజిటల్ సంతకాలు(Digital signatures), పాస్బుక్లు, గిరిజన భూముల విచారణ పేరుతో లక్షల్లో బేరాలు సాగుతున్నాయి. లేఅవుట్ అనుమతులు, భవన నిర్మాణాల ఆమోదం, నిధుల మంజూరు కోసం విచ్చలవిడిగా వసూళ్లకు దిగుతున్నారు.

స్టేషన్ బెయిళ్లు, కేసుల రీఓపెన్ నిలిపివేత, అక్రమ మద్యం, చెక్పోస్టుల వద్ద లంచాలు సాధారణమైపోయాయి. ఆస్పత్రుల అనుమతులు, బిల్లుల క్లియరెన్స్లకు సైతం పర్సంటేజీలు ఆశిస్తున్నారు. ఏసీబీకి చిక్కిన అధికారుల జాబితా గత రెండేళ్లలో కొన్ని సంచలన కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

 ఏసీబీ అంటే భయం లేదా?

ఏసీబీ దాడులు, అరెస్టులు అధికారులకు కేవలం ఒక వార్తగా మారిపోయిందే తప్ప వారిలో ఏమాత్రం భయం కలగడం లేదు. జైలుకు వెళ్లి బెయ్పి వచ్చి మళ్లీ పోస్టింగ్ తెచ్చుకోవచ్చనే ధీమా అధికారుల్లో పెరిగిపోయింది. దీనివల్ల సామాన్య, పేద ప్రజలు తమ హక్కుల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగలేక, లంచాలు ఇచ్చుకోలేక తీవ్ర నరకం అనుభవిస్తున్నారు.

పట్టుబడిన అధికారులు

జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, డీఎంహెచ్వో స్వర్ణ కుమారి జిల్లా ఏడీ సర్వేయర్ శ్రీనివాస్, ఇరిగేషన్ ఈ ఈ బన్సీ లాల్ ఇలా చెప్పుకుంటూ పోతే అటెండర్ నుంచి అధికారుల వరకు శాతాడంతాజాబితా అవుతుంది. జిల్లాలో ప్రతి శాఖ దాదాపుగా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఏసీబీకి పట్టుబడడం గమనార్హం

కలెక్టర్ గారూ.. కన్నేయండి!

27 మండలాల పరిధిలో విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాకు ‘అవినీతి నిలయం’ అనే శాశ్వత ముద్ర పడకముందే కలెక్టర్ కె.నారాయణరెడ్డి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజాసంఘాల నేతలు, ప్రజాస్వామిక వాదులు కోరుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కలెక్టర్ స్వయంగా తనిఖీలు చేపట్టాలి. కలెక్టరేట్ పరిధిలో లంచాలపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటుచేసి ఇంటెలిజెన్స్ ద్వారా అవినీతి అధికారుల జాబితా తయారుచేయాలి.

ఆఫీసుల్లో వారాల తరబడి ఫైళ్లను నిలిపివేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఫైల్ ఆలస్యమైతే లంచం అడుగుతున్నట్లే భావించాలి. ఫిర్యాదులపై రివ్యూ మీటింగ్లు.. ప్రతినెలా అధికారుల పనితీరుతో పాటు వారిపై వస్తున్న అవినీతి ఫిర్యాదుల ఆధారంగా కలెక్టరేట్ వేదికగా ప్రజల సమక్షంలో జవాబుదారీతనం పెంచాలి. కలెక్టర్ వెంటనే కొరడా ఝళిపించి లంచగొండి అధికారుల భరతం పడితేనే రంగారెడ్డి జిల్లా పరువు నిలుస్తుంది.

ఏసీబీకి పట్టుబడిన అధికారులు పేర్లు మచ్చుకు కొన్ని..

 నార్సింగి లో టిపిఓ మనిహారిక, మణికొండలో జలమండని మేనేజర్ స్ఫూర్తి రెడ్డి, రాజేంద్రనగర్ డి ఈ రవికుమార్, బడంగ్పేట్ టి పి ఓ అశోక్ దేవేందర్ రెడ్డి, మణికొండ డి మున్సిపల్ దివ్య జ్యోతి, ఇరిగేషన్ ఏఈ నికేష్, సర్వేయర్ గణేష్, ఇరిగేషన్ ఏఈ కార్తీక్, గచ్చిబౌలి ఏడీఈ సతీష్, సరూర్నగర్ డిఈ రామ్మోహన్, విక్టోరియా మెమోరియల్ ప్రిన్సిపాల్ ప్రభుదాస్, వనస్థలిపురం సబ్ రిజిస్టర్, ఆమనగల్ తాసిల్దార్ లలిత, మాదాపూర్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ ఎం సుధా,చేవెళ్ల సబ్ ట్రెజరీ లో మాడిగ లక్ష్మయ్య  సబ్ ట్రెజరీ అధికారి,కావలి అనురాధ, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి, మొయినాబాద్ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణి, సీనియర్ అసిస్టెంట్ యెలమోని సుదర్శన్.

మరిన్ని వార్తలు