బ్యాలెట్ పేపర్లే ముద్దు!
- ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే మార్గం ఇదే!
- అత్యధిక దేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్‌తోనే ఎన్నికలు
అక్టోబర్ ౭ (విజయక్రాంతి): ఓటర్ల జాబితా రూపకల్పనలో(Preparation of the voters list) అవకతవకలు జరిగాయన్న వాదనల నేపథ్యంలో భారత ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఈవీఎంల పని తీరు, ఓటర్ల జాబితాలో మార్పుల వల్ల పలు ఎన్నికల్లో ఫలితాలను ప్రభావితం అయ్యాయంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతో(Rahul Gandhi) పాటు పలు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ఇదే సమయంలో ఎన్నికల సంఘం(Election Commission) (ఈసీఐ) పారదర్శకత, సంస్థాగత స్వతంత్రతపై కొందరు మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు కూడా ఆందోళనలు వ్యక్తం చేయడం గమనార్హం. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. వీవీప్యాట్ వ్యవస్థతో(VVPAT system) కూడిన ఈవీఎంల విశ్వసనీయతను సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. అయినప్పటికీ, ముఖ్యంగా జనరేషన్- జెడ్ ఓటర్లు, పౌర సమాజంలోని కొంతవర్గం సంప్రదాయ బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని కోరుతున్నారు.
అయితే బ్యాలెట్ నుంచి ఈవీఎం వైపు సాగిన ప్రజలు గతానికి తిరిగి వెళ్లడమా అనేది ప్రధాన ప్రశ్న కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎన్నికల ప్రక్రియ కనిపించేలా, స్వయంగా ధృవీకరించుకునేలా ఓటర్లలో విశ్వాసాన్ని ఎలా కల్పించాలి? అన్నదే అసలు ప్రశ్న.
ఈవీఎంల వైపు భారత్ ఎందుకెళ్లింది?
1990లలో భారత్‌లో ఈవీఎంలను ప్రవేశపెట్టడానికి బలమైన కారణాలున్నాయి. పోలింగ్ బూత్‌లను స్వాధీనం చేసుకోవడం, బ్యాలెట్ పేపర్లను అక్రమంగా పెట్టెల్లో వేయడం, చెల్లని ఓట్లు అధిక శాతం ఉండటం, అలాగే నెమ్మదిగా జరిగే మాన్యువల్ లెక్కింపు వంటి సమస్యలకు ఈవీఎంలు పరిష్కారంగా నిలిచాయి. కొన్ని నియోజకవర్గాల్లో చెల్లని ఓట్ల సంఖ్యే గెలుపు మార్జిన్‌ను మించిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవీఎంలతో చెల్లని ఓట్ల సమస్య గణనీయంగా తగ్గింది. ఫలితాల లెక్కింపులో వేగం పెరిగింది.
భారీస్థాయిలో భౌతికంగా జరిగే ఎన్నికల మోసాలకు కూడా అడ్డుకట్ట పడింది. వీవీప్యాట్‌తో కూడిన, నెట్‌వర్క్‌కు అనుసంధానం కాని ఈవీఎంల వ్యవస్థకు ఎన్నికల సంఘం పలు భద్రతా చర్యలను తీసుకుంటోంది. ర్యాండమ్‌గా యంత్రాల కేటాయింపు, బహుళస్థాయి సీలింగ్, సీసీటీవీ పర్యవేక్షణ, అభ్యర్థుల తరఫున ఏజెంట్లు ఉండటం, వీవీప్యాట్ స్లిప్పుల నమూనా ధృవీకరణ వంటి చర్యలు ఇందులో ఉన్నాయి.
ఎన్నికల సంఘం వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం.. కోట్లాది ఓట్లకు సంబంధించిన లక్షలాది యంత్రాల వీవీప్యాట్ ధృవీకరణల్లో ఎలాంటి వ్యత్యాసాలు కనిపించలేదు. సుప్రీంకోర్టు కూడా పలుమార్లు ఈ వ్యవస్థ సమగ్రతను సమర్థించింది. మరింత విస్తృతం చేయడానికి అనుమతించింది. అయితే ప్రజాస్వామ్యంలో ప్రక్రియ ఎంత సురక్షితమనేది కాదు.. దానిపై ప్రజలు ఎంత నమ్మకంతో ఉన్నారనేదే ముఖ్యం.
బ్లాక్ బాక్స్ భావన
ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న ప్రధాన సందేహం దాని సాంకేతికతలోనే ఉంది. యంత్రంలో పనిచేసే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ను సాధారణ ఓటరు స్వయంగా పరిశీలించి ఆడిట్ చేయలేడు. అయితే, కాగితంపై వేసిన ఓటును మాత్రం ఓటరు స్వయంగా చూడగలడు. అవసరమైతే అధికారులు, అభ్యర్థుల ప్రతినిధులు, పరిశీలకులు దానిని లెక్కించడాన్ని కూడా గమనించవచ్చు. ఈ బ్లాక్ బాక్స్ భావననే ఎలక్ట్రానిక్ రికార్డింగ్స్ అనుమానాలకు కారణమవుతోంది. అందుకే ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలు పూర్తిస్థాయి ఎలక్ట్రానిక్ ఓటింగ్ కంటే పేపర్ బ్యాలెట్ లేదా పేపర్ ఆధారిత హైబ్రిడ్ విధానాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి.
అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్‌కే ప్రాధాన్యం
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ గణాంకాల ప్రకారం.. అధ్యయనం చేసిన 178 దేశాల్లో కేవలం 34 దేశాలు- అంటే.. సుమారు 19శాతం- జాతీయ స్థాయి, లేదా అంతకంటే దిగువ స్థాయిలో ఏదో ఒక రూపంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ను ఉపయోగిస్తున్నాయి. యూరప్ ఇప్పటికీ ప్రధానంగా పేపర్ ఆధారిత ఎన్నికల వ్యవస్థపైనే ఉంది.
జర్మనీ రాజ్యాంగ న్యాయస్థానం 2009లో ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో సాధారణ పౌరుడు ఎన్నికల ప్రక్రియను స్వయంగా ధృవీకరించే అవకాశం పరిమితంగా ఉందన్న కారణాలతో, అప్పట్లో ఉపయోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంపై కీలక తీర్పు ఇచ్చింది. నెదర్లాండ్స్ కూడా కొంతకాలం యంత్రాలను ఉపయోగించిన తరువాత మళ్లీ బ్యాలెట్ పేపర్ విధానానికి తిరిగొచ్చింది. యునైటెడ్ కింగ్‌డమ్, ఫిన్లాండ్, ఐర్లాండ్ వంటి దేశాలు, అలాగే యూరప్‌లోని అనేక ఇతర దేశాలు చేతితో గుర్తు పెట్టే లేదా పేపర్ బ్యాలెట్‌ను స్కాన్ చేసే విధానాలనే అనుసరిస్తున్నాయి. కెనడాలో ఫెడరల్, ప్రొవిన్షియల్ ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లే ప్రధాన ఆధారం.
ఇజ్రాయెల్ వంటి అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన, నిరంతరం సైబర్ ముప్పులను ఎదుర్కొనే దేశం కూడా ఇప్పటికీ సంప్రదాయ పేపర్ బ్యాలెట్ విధానాన్నే కొనసాగిస్తోంది. జపాన్ కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయడం లేదు. అమెరికాలోనూ ప్రస్తుతం అత్యధిక మంది ఓటర్లు చేతితో గుర్తు పెట్టే పేపర్ బ్యాలెట్లను లేదా పేపర్ రికార్డు సృష్టించే బ్యాలెట్ మార్కింగ్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. అనంతరం ఆ బ్యాలెట్లను ఆప్టికల్ స్కానర్ల ద్వారా లెక్కిస్తారు. పేపర్ రికార్డులేని డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్ యంత్రాల వినియోగం గణనీయంగా తగ్గింది.
భారత్‌కు హైబ్రిడ్ మార్గం..
దాదాపు వంద కోట్ల మంది ఓటర్లున్న మన దేశంలో 1990ల నాటి పూర్తిస్థాయి పేపర్ బ్యాలెట్ విధానానికి తిరిగి వెళ్లడం భారీ లాజిస్టిక్ సవాలుగా మారుతుంది. పర్యావరణ వ్యయం పెరుగుతుంది. అంతేకాకుండా, ఈవీఎంల రాకతో కనుమరుగైన పాతకాలపు ఎన్నికల అక్రమాలకు మళ్లీ అవకాశం ఏర్పడవచ్చు. అందుకే ఈ సమస్యకు పరిష్కారం గతానికి పూర్తిగా తిరిగి వెళ్లడం కాదు. పేపర్ పారదర్శకతను ఆధునిక సాంకేతికతతో కలిపే హైబ్రిడ్ విధానాన్ని రూపొందించడం. ఓటర్లు పేపర్ బ్యాలెట్‌పై గుర్తు పెట్టవచ్చు.
లేదా ఓటరు ఎంపికను మానవులు చదవగలిగే రూపంలో పేపర్‌పై ముద్రించే బ్యాలెట్ మార్కింగ్ పరికరాలను ఉపయోగించవచ్చు. అవసరమైతే ఆ పేపర్‌పై కోడ్ లేదా బార్‌కోడ్ వంటి ఆధునిక సాంకేతిక అంశాలను కూడా జోడించవచ్చు. ఓటింగ్ పూర్తయిన తరువాత బ్యాలెట్లను సురక్షిత పెట్టెల్లో భద్రపరచాలి. పార్టీల ప్రతినిధుల సమక్షంలో వాటికి సీల్ వేయాలి. అదే సమయంలో ఆప్టికల్ స్కానర్లు లేదా హై-స్పీడ్ టాబ్యులేటర్ల ద్వారా ఓట్లను వేగంగా లెక్కించవచ్చు. అయితే ప్రతి భౌతిక బ్యాలెట్‌ను ఆడిట్, రీకౌంట్ కోసం భద్రపరచాలి.
ఆడిట్లు తప్పనిసరి కావాలి..
రాండమ్‌గా ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో రిస్క్ -లిమిటింగ్ ఆడిట్లు నిర్వహించడం సాధారణ ప్రక్రియగా మారాలి. ఇవి యంత్రం లెక్కించిన ఫలితాల్లో లోపాలు ఉంటే.. అధిక విశ్వసనీయతతో గుర్తించేలా రూపొందించవచ్చు. స్కాన్ చేసిన ఫలితాల సమగ్రత, పోలింగ్ కేంద్రం నుంచి తుది ఫలితం వరకు బ్యాలెట్ల తరలింపు వివరాలను భద్రపరచడానికి బ్లాక్‌చెయిన్ లేదా డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీని కూడా ఉపయోగించవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. బ్లాక్‌చెయిన్ ఓటును నియంత్రించడానికి కాదు. ఓట్ల లెక్కింపు, డేటా బదిలీ, చైన్- ఆఫ్- కస్టడీ రికార్డులను భద్రపరచడానికి మాత్రమే ఉపయోగించాలి.
మరింత సాంకేతిక భద్రత..
ఓటరు గుర్తింపును నిర్ధారించడానికి బయోమెట్రిక్ లేదా డిజిటల్ ఆథెంటికేషన్‌ను పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించే అవకాశాన్ని పరిశీలించవచ్చు. అయితే ఓటు గోప్యతకు ఎలాంటి భంగం కలగకూడదు. పోలింగ్ శాతం, సీలింగ్ చేసిన బ్యాలెట్ బాక్సుల స్థితి వంటి సమాచారాన్ని వ్యక్తిగత ఓటును వెల్లడించకుండా రియల్‌టైమ్ పబ్లిక్ డ్యాష్ బోర్డుల ద్వారా అందుబాటులో ఉంచవచ్చు. బ్యాలెట్ లెక్కింపు సమయంలో అసాధారణ నమూనాలు లేదా డూప్లికేట్ మార్కింగ్‌లను గుర్తించడానికి ఇమేజ్ అనాలిసిస్‌ను ఉపయోగించవచ్చు.
యంత్రాలు సహాయపడే చోట 100 శాతం లేదా అత్యధిక శాతం పేపర్ ధృవీకరణను తప్పనిసరి చేయవచ్చు. అభ్యర్థుల ప్రతినిధుల సమక్షంలో సింబల్ లోడింగ్, యంత్రాల కమిషనింగ్ వంటి కీలక ప్రక్రియలను వీడియో పర్యవేక్షణలో నిర్వహించవచ్చు. ప్రత్యేక వర్గాల ఓటర్లు, దూర ప్రాంతాల కోసం పరిమితంగా, భద్రంగా ఉండే పోస్టల్ లేదా ఎలక్ట్రానిక్ విధానాలను కొనసాగించవచ్చు. అయితే దేశవ్యాప్త ప్రధాన ఎన్నికల వ్యవస్థకు పేపరే ప్రాథమిక ఆధారంగా ఉంచాలి.
పెద్ద దేశానికి సాధ్యమా..?
భారత్ వంటి పెద్ద దేశంలో స్కానర్లు గంటకు వేలాది బ్యాలెట్లను ప్రాసెస్ చేయగలవు. అందువల్ల పూర్తి మాన్యువల్ లెక్కింపుతో పోలిస్తే ఈ విధానం వేగంగా ఉంటుంది. అదే సమయంలో పూర్తిగా ఎలక్ట్రానిక్ లెక్కింపుతో పోలిస్తే మరింత పరిశీలించే, ఆడిట్ చేయగలిగే వ్యవస్థగా చెప్పవచ్చు. బ్యాలెట్ రూపకల్పనను మెరుగుపరచడం, ఓటర్లకు సరైన అవగాహన కల్పించడం ద్వారా చెల్లని ఓట్లను కనిష్ఠ స్థాయికి తీసుకురావచ్చు. గెలుపు మార్జిన్ చాలా తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో భౌతిక బ్యాలెట్లను పూర్తిగా మళ్లీ లెక్కించే అవకాశం ఉంటుంది.
పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు రీసైకిల్ చేసిన పేపర్‌ను ఉపయోగించవచ్చు. చట్టం పరిధిలో నిర్దేశించిన కాలం నిల్వ చేసి.. తరువాత అవసరమైన సమాచారాన్ని డిజిటల్‌గా భద్రపరచవచ్చు. ప్రారంభ దశలో స్కానర్లు, లాజిస్టిక్స్, భద్రతా వ్యవస్థలపై అదనపు వ్యయం తప్పదు. అయితే దీర్ఘకాలంలో పరికరాల వినియోగం, ఎన్నికల వివాదాల తగ్గింపు, పారదర్శకత పెంపు వంటి ప్రయోజనాలు ఆ వ్యయాన్ని తగ్గించే అవకాశం ఉంది.
ఓటర్ల జాబితాల మార్పులు, అంతర్గత ఎన్నికల సంఘం అభిప్రాయ భేదాలపై వచ్చిన వివాదాలు, చర్చలు, పాత ఓటర్ల జాబితాలను బహిర్గతం చేయాలన్న డిమాండ్లు, బ్యాలెట్ పేపర్లను తిరిగి తీసుకురావాలన్న ప్రతిపక్ష పార్టీల డిమాండ్లన్నీ కలిసి సంస్థలపై ప్రజల విశ్వాసం ఎంత సున్నితమైనదో స్పష్టం చేస్తోంది. ఈ ఆరోపణలన్నీ ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉన్నాయి. ఎన్నికల సంఘం మాత్రం తన నిర్ణయాలు సమిష్టిగా తీసుకున్నవేనని, అమలు చేస్తున్న విధానాలు పటిష్టమైనవేనని చెబుతోంది.
అయితే సమాజంలోని గణనీయమైన వర్గాలు, ముఖ్యంగా డిజిటల్ యుగంలో పెరిగిన యువత, ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేస్తే దాని ప్రభావం కేవలం ఒక ఎన్నికకే పరిమితం కాదు. అది ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని ప్రభావితం చేస్తుంది. పారదర్శకమైన హైబ్రిడ్ విధానాన్ని తీసుకురావడమనేది గతంలో తప్పు జరిగిందని అంగీకరించడం కాదు. ప్రజలకు కనిపించే విధంగా, స్వయంగా ధృవీకరించుకునే విధంగా ఎన్నికల ప్రక్రియను ఏర్పాటు చేయడమనే గమనించాలి.
భారత్ భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ను ప్రవేశపెట్టడం ఒకప్పుడు అవసరమైన సాంకేతిక పరిణామం. ఇప్పుడు తదుపరి దశ మరింత మెరుగైన సమన్వయం కావాలి. విశ్వసనీయత కోసం పేపర్,- వేగం, భద్రత, అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సాంకేతికత. ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ను పూర్తిగా తిరస్కరించిన, పరిమితం చేసిన అనేక దేశాలు సాంకేతికతకు వ్యతిరేకంగా అలా చేయలేదు.
ఎన్నికలు సురక్షితమని కేవలం నిపుణులతో ప్రకటించడం సరిపోదని, వాటిని సాధారణ పౌరుడు కూడా విశ్వసించాలని ఆయా దేశాలు గుర్తించాయి. వైవిధ్యభరితమైన, తీవ్రమైన రాజకీయ పోటీ ఉన్న భారతదేశానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కనిపించే, ఆడిట్ చేయగలిగే బ్యాలెట్ల ద్వారా ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం -భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు కోసం అవసరమైన తదుపరి పరిణామం కావచ్చు.
కాగితం ఎందుకు?
అసలు కాగితం ఎందుకనే ప్రశ్నను లేవనెత్తితే సాంకేతికతపై వ్యతిరేకత కారణం కాదు. ఎన్నికల ఫలితాలను చివరి దశ వరకు స్వతంత్రంగా ధృవీకరించగలగడమే దీనికి ప్రధాన కారణం. ఓటరు తన ఓటును చూసి నిర్ధారించుకోగలడు. ఎన్నికల పరిశీలకులు లెక్కింపును గమనించగలరు. అవసరమైతే మళ్లీ లెక్కించవచ్చు. గణాంకపరమైన ఆడిట్ల ద్వారా యంత్రం చూపించిన ఫలితాలను భౌతిక బ్యాలెట్లతో పోల్చవచ్చు. ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఎంత అధునాతనమైనదైనా సాధారణ పౌరుడికి దాని అంతర్గత సాఫ్ట్‌వేర్ లేదా కోడ్‌ను స్వయంగా ధృవీకరించే అవకాశం ఉండదు.
ఇంటర్నెట్‌కు అనుసంధానం కాని యంత్రాలను రిమోట్‌గా హ్యాక్ చేయడం కష్టమే అయినప్పటికీ అంతర్గత వ్యక్తుల నిజాయితీ, సరఫరా వ్యవస్థలోని లోపాలు లేదా గుర్తించలేని కోడ్ మార్పులు వంటి సైబర్ భద్రతా ప్రమాదాలను పూర్తిగా తోసిపుచ్చలేమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ చర్చలో అత్యంత కీలకమైన అంశం సాంకేతిక భద్రత మాత్రమే కాదు -ప్రజల విశ్వాసం. ఎన్నికల ఫలితాలపై వివాదం తలెత్తినప్పుడు, ఒక భౌతిక పేపర్ ట్రయల్ ప్రజలకు స్వతంత్రంగా ధృవీకరించగల ఆధారాన్ని అందిస్తుంది.
ప్రపంచంలో పేపర్ బ్యాలెట్ విధానం
యూరప్‌లో జర్మనీ, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్ (కొన్ని మున్సిపాలిటీల్లో పరిమితంగా యంత్రాల వినియోగం), ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్, స్వీడన్, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, ఐర్లాండ్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ (కొంత పరిమితంగా ఆన్‌లైన్ విధానాలతో), బెల్జియం (మిశ్రమ విధానం), రొమేనియా తదితర యూరప్ దేశాల్లో పేపర్ బ్యాలెట్లు ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. జర్మనీ రాజ్యాంగ న్యాయస్థానం 2009లో ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో పారదర్శకత, ప్రజల స్వయం సమీక్షకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. నెదర్లాండ్స్ కూడా యంత్రాల వినియోగాన్ని నిలిపివేసి పేపర్ విధానానికి తిరిగి వచ్చింది.
ఉత్తర అమెరికా: కెనడా.. ఫెడరల్, ప్రావిన్షియల్ ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లే ప్రధాన విధానం. కొన్ని మున్సిపల్ ఎన్నికల్లో ఆప్టికల్ స్కానర్లు ఉపయోగిస్తారు.
అమెరికా: అత్యధిక మంది ఓటర్లు చేతితో గుర్తు పెట్టే పేపర్ బ్యాలెట్లను లేదా పేపర్ రికార్డు సృష్టించే బ్యాలెట్ మార్కింగ్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. వీటిని సాధారణంగా ఆప్టికల్ స్కానర్ల ద్వారా లెక్కిస్తారు. పేపర్ రికార్డు లేని పూర్తిస్థాయి ఎలక్ట్రానిక్ యంత్రాల వినియోగం ఇప్పుడు చాలా పరిమితంగా ఉంది.
ఆసియా -పసిఫిక్.. ఇతర దేశాలు: జపాన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా వంటి దేశాలు ప్రధానంగా పేపర్ ఆధారిత ఓటింగ్ విధానాన్నే అనుసరిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రానిక్ సాంకేతికతను సహాయకంగా ఉపయోగిస్తాయి.
లాటిన్ అమెరికా.. ఇతర ప్రాంతాలు: ఉరుగ్వే, చిలీ, కొలంబియా తదితర దేశాలు ప్రధానంగా పేపర్ బ్యాలెట్లపై ఆధారపడుతున్నాయి. ఆఫ్రికా, ఆసియాలోని అనేక ఇతర దేశాల్లోనూ పేపర్ బ్యాలెట్ ప్రామాణిక ఎన్నికల విధానంగా కొనసాగుతోంది.