వన్యప్రాణులకు దాహం.. తీరని నీటి గోస!

03-11-2026 | 05:20am
  1. మంచిరేవుల ఫారెస్ట్ పార్కులో నీటి తొట్లు ఖాళీ
  2. గడ్డితో కమ్ముకున్న వాకింగ్ ట్రాక్
  3. పట్టించుకోని అటవీశాఖ అధికారులు

రాజేంద్రనగర్, నవంబర్ 2 (విజయక్రాంతి): మంచిరేవుల ఫారెస్ట్ పార్కులో(Manchirevula Forest Park) వన్యప్రాణులకు నీటి కష్టాలు(Water Woes) తప్పడం లేదు. పార్కులో నివసించే నెమళ్లు, పాలపిట్టలు సహా వేలాది పక్షులు, ఇతర వన్యప్రాణులు(Wildlife) దాహంతో అల్లాడుతున్నా వాటి దాహం తీర్చేందుకు అటవీశాఖ(Forest Department) అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పార్కులో నీటి లభ్యత తగ్గిపోవడంతో మూగజీవాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ప్రతిరోజూ రూ.50 ప్రవేశ రుసుము చెల్లించి పార్కుకు వస్తున్న మార్నింగ్ వాకర్స్కు సైతం కనీస సౌకర్యాలు అందుబాటులో లేవు. మరోవైపు వన్యప్రాణుల సంరక్షణ కోసం పార్కులో ఏర్పాటు చేసిన నీటి తొట్లలో నీరు లేకపోవడంతో పక్షులు, ఇతర జీవులు దాహం తీర్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. కొన్ని ప్రాంతాల్లో నీటి తొట్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటిలో క్రమం తప్పకుండా నీటిని నింపకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాకింగ్ ట్రాక్ సైతం గడ్డితో కమ్ముకుపోవడంతో నడిచేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ మంచిరేవుల ఫారెస్ట్ పార్కులో కనీస నిర్వహణ కనిపించడం లేదని సందర్శకులు అంటున్నారు.

అధికారులు స్పందించాలి..

అటవీశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పార్కులోని నీటి తొట్లలో నిరంతరం నీటిని అందుబాటులో ఉంచాలని, వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ప్రకృతి, వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు. అలాగే గడ్డితో కమ్ముకుపోయిన వాకింగ్ ట్రాక్ను శుభ్రం చేసి, సందర్శకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు