బస్టాప్ ఇక్కడ.. బస్ ఆగేది ఎక్కడ?
మొయినాబాద్ చౌరస్తాలో ప్రయాణికుల పరుగులు.. డ్రైవర్ల ఇష్టారాజ్యం
సిగ్నళ్లు లేక నిత్యం ట్రాఫిక్ నరకం
ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని డిమాండ్
మొయినాబాద్, అక్టోబరు 26 (విజయక్రాంతి): నిర్ణీత బస్టాప్(Designated bus stop) ఒక చోటైతే.. బస్సు ఆగేది మరోచోట! పరుగు లంఘిస్తే తప్ప బస్సు ఎక్కలేని దుస్థితి. సరియైన ట్రాఫిక్ సిగ్నళ్లు(Traffic signals) లేక గంటల తరబడి స్తంభిస్తున్న వాహనాలు.. రోడ్డు దాటాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇది రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) మొయినాబాద్ ప్రధాన చౌరస్తాలో ప్రతిరోజు కనిపిస్తున్న దయనీయ దృశ్యం. ఆర్టీసీ డ్రైవర్ల(RTC drivers) అస్తవ్యస్త నిలుపుదల, ఆర్టీసీ-ట్రాఫిక్ అధికారుల నిర్లక్ష్యం వల్ల నిత్యం వేలాది మంది ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు.
200 మీటర్ల పరుగు పందెం...
హైదరాబాద్ నుంచి చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు, నారాయణపేట వైపు వెళ్లే వందలాది బస్సులు రోజూ ఈ చౌరస్తా మీదుగానే ప్రయాణిస్తాయి. గతంలో బస్సులన్నీ కేటాయించిన ప్రధాన బస్టాప్ వద్దే ఆగేవి. కానీ, ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్లు బస్టాప్‌కు సుమారు 200 మీటర్ల దూరంలో రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ నిలుపుతున్నారు. దీంతో బస్సు ఎక్కడానికి ప్రయాణికులు లగేజీలతో పరుగులు తీయాల్సి వస్తోంది. ముఖ్యంగా ’మహాలక్ష్మి’ పథకం(Mahalakshmi Scheme) ద్వారా ఉచిత ప్రయాణం చేసే మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలతో ఉన్న తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు బస్టాప్ వద్ద వేచి చూస్తుంటే, డ్రైవర్లు దూరంగా ఆపడం లేదా వేగంగా వెళ్ళిపోతుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిగ్నళ్లు లేవు.. ప్రాణాలకు రక్షణ లేదు..
హైదరాబాద్ - బీజాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న ఈ చౌరస్తాలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. సరైన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. రోడ్డు దాటేందుకు సరైన కాలినడక దారులు (జైబ్రా క్రాసింగ్) లేదా నియంత్రణ లేకపోవడంతో పాఠశాల విద్యార్థులు, స్థానికులు తీవ్ర భయాందోళనల మధ్య రోడ్డు దాటుతున్నారు. చౌరస్తాలో వెంటనే అధునాతన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలి.
ఆర్టీసీ డ్రైవర్లు తప్పనిసరిగా కేటాయించిన బస్టాప్‌లోనే బస్సులను ఆపేలా డిపో మేనేజర్లు ఆదేశాలు జారీ చేయాలి.నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు మధ్యలో బస్సులు ఆపే డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించాలి. ప్రయాణికులు ఎండ, వానల నుండి రక్షణ పొందేలా బస్టాప్ వద్ద నీడ (షెల్టర్), తాగునీటి సదుపాయం కల్పించాలి.స్థానిక సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఉన్నతాధికారులు, రవాణా శాఖ, పోలీస్ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.