విద్యుత్ సమస్యల పరిష్కారానికి ‘బస్తీబాట’
- 21 సర్కిళ్లలో టీజీఎస్‌పీడీసీల్ ప్రత్యేక డ్రైవ్
- క్షేత్రస్థాయికి అధికారులు సీఎండీ జితేష్ వి. పాటిల్ ఆదేశాలు
- విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యంగా విస్తృత నిర్వహణ పనులు
హైదరాబాద్ బ్యూరో అక్టోబర్ 8 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని, సురక్షితమైన విద్యుత్ను అందించడమే లక్ష్యంగా తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీస్పడీసీల్ ) చేపట్టిన ’బస్తీబాట - ప్రజాబాట’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. సంస్థ సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్(CMD Jitesh V. Patil) ఆదేశాల మేరకు 21 సర్కిళ్ల పరిధిలోని అధికారులు, సిబ్బంది నేరుగా బస్తీలు, గ్రామాలు, కాలనీల్లో పర్యటిస్తూ విద్యుత్ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు.ఈ డ్రైవ్లో భాగంగా ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, డీటీఆర్ యార్డ్ క్లీనింగ్, చెట్ల కొమ్మల కత్తిరింపు, లో-వోల్టేజ్ సమస్యల నిర్మూలన, ఎల్టీ లైన్ స్పేసర్ల ఏర్పాటు, కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఛార్జింగ్ వంటి అత్యవసర పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
నగరాల నుంచి పల్లెల వరకు....
హైదరాబాద్ మెట్రో జోన్ పరిధిలోని సైదాబాద్, శంకర్మఠ్, లంగర్హౌస్, అస్మాన్గఢ్, లాల్బజార్, బైరామల్గూడ తదితర ప్రాంతాల్లో భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాల వారీగా సిద్ధిపేట (తునికిబొల్లారం), ములుగు, మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, నల్గొండ, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో గ్రామసభలు, ముఖాముఖి సమావేశాలు నిర్వహించి ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి పరిష్కరించారు. భవిష్యత్ విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు భూసర్వేలు కూడా నిర్వహిస్తున్నారు.
ప్రజల ముంగిట్లోకి విద్యుత్ సేవలు....
కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా అధికారులే స్వయంగా తమ ప్రాంతాలకు వచ్చి వదులుగా ఉన్న తీగలు సరిచేయడం, ప్రమాదకర స్తంభాలను మార్చడంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల సంతృప్తి, అంతరాయం లేని విద్యుత్ సరఫరాయే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తామని సంస్థ అధికారులు స్పష్టం చేశారు.