పిల్లల రక్షణకు సూర్యాపేట జిల్లాలో సమగ్ర ప్రణాళిక

21-11-2026 | 12:08am

* మిషన్ వాత్సల్య కింద, యునిసెఫ్ సహకారంతో ‘సీ పీ ఎస్ ఎస్ ’ అమలు

* అన్ని శాఖల సమన్వయంతో బాలలకు భద్రత

* ‘పిల్లల గళం’ ద్వారా 9,558 మంది విద్యార్థుల అభిప్రాయాల సేకరణ

* కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, నవంబర్ 20 (విజయక్రాంతి) : ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం(World Children's Rights Day) సందర్భంగా సూర్యాపేట జిల్లాలో పిల్లల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం మిషన్ వాత్సల్య(Mission Vatsalya) కింద యునిసెఫ్(UNICEF) సహకారంతో రూపొందించిన ‘బాలల రక్షణ వ్యవస్థ బలోపేతం’ (సీ పీ ఎస్ ఎస్ ) ప్రణాళికను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(Suryapet District Collector Tejas Nandlal Pawar) ప్రారంభించారు. ఇప్పటికే అమలవుతున్న వివిధ శాఖల కార్యక్రమాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి, సమన్వయంతో పనిచేయడమే దీని ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు.

సెప్టెంబర్‌లో 970 ప్రశ్నలతో నిర్వహించిన అధ్యయనం, నవంబర్ 6న 99 చోట్ల 10–18 ఏళ్ల పిల్లలతో ‘పిల్లల గళం’ పేరిట సేకరించిన 9,558 అభిప్రాయాల ఆధారంగా బడిలో దండన, మత్తు పదార్థాలు, వేధింపులు, పరీక్షల ఒత్తిడి వంటి సమస్యల పరిష్కారానికి ఈ ప్రణాళికను రూపొందించారు.

నివారణ, ముందస్తు గుర్తింపు, కేసుల నిర్వహణ, పునరావాసం, వ్యవస్థ బలోపేతం అనే ఐదు ప్రధాన అంశాలతో పాటు గ్రామ, మండల స్థాయిల్లో రక్షణ కమిటీల ద్వారా పోషకాహారం నుంచి ఉద్యోగ మార్గదర్శనం వరకు పిల్లలకు అండగా నిలుస్తామని తెలిపారు. పిల్లల రక్షణ అందరి ఉమ్మడి బాధ్యతని స్పష్టం చేసిన ఈ కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, జాయింట్ కలెక్టర్ బి.హరి సింగ్, యునిసెఫ్ ప్రతినిధి ఫిలిప్స్, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు