ఇన్‌చార్జీలు యమటఫ్!
కొత్తవారి రాకతో రాష్ట్ర బీజేపీ నేతలకు కొత్త టెన్షన్!
- పనిచేయని నేతలకు సీరియస్‌గా క్లాస్ పీకిన ఇన్‌చార్జీలు
- హైదరాబాద్‌ను వీడి క్షేత్రస్థాయిలో తిరగాల్సిందేనని వార్నింగ్
అక్టోబర్ 7 (విజయక్రాంతి): కొత్త ఇన్‌చార్జీల రాకతో తెలంగాణ కమలం పార్టీలో(Telangana Lotus Party) వాతావరణం హీటెక్కింది. ఇక నుంచి ఒక లెక్క.. ఇప్పటినుంచి మరోలెక్క అంటూ రాష్ట్ర నేతలకు కొత్త ఇన్‌చార్జీలు(In-charges) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తొలి సమావేశంలోనే నేతల పనితీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. పనిచేయని నేతలు ఉండాల్సిన అవసరం లేదని ఘాటుగా వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
‘పదవులు తీసుకుంది పనిచేయడానికే.. ఏసీ గదుల్లో కూర్చుంటామంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావ డం కష్టం’ అని తెగేసి వారు చెప్పడంతో పార్టీ రాష్ట్ర నాయకులు మొదలు.. జిల్లా అధ్యక్షులు(District Presidents), ఇతర నాయకుల్లో కలవ రం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు(Assembly elections) ఇంకా రెండేళ్ల సమయమే ఉండటంతో తెలంగాణ బీజేపీలో సంస్థాగత మార్పులతో కొత్త నాయకత్వం సరికొత్త వ్యూహాలతో ముందుకు పోవాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నది. ఈక్రమంలోనే ఇటీవల రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నేతల పనితీరుపై వాడి వేడిగా చర్చ జరగడంతో కొత్త ఇన్‌చార్జీల రాకతో పాత నేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది.
కూర్చుంటే ఇక కుదరదు..!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జీగా సునీల్ బన్సల్, సహ ఇన్‌చార్జీగా అభయ్ పాటిల్, రేఖా శర్మ, రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జీగా మధుకర్, సహా ప్రబారిగా దశరథ్‌ను జాతీయ నాయకత్వం నియమించిన విషయం తెలి సిందే. ఇటీవల రాష్ట్ర కార్యాలయంలో మిషన్ తెలంగాణలో భాగంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జీ మధుకర్, సహా ప్రబారి దశరథ్‌లతో జరిగిన సమావేశం హాట్‌హాట్‌గా జరిగింది. బీజేపీ స్టేట్ చీఫ్ రాం చందర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి రాష్ట్ర పార్టీ వ్యవహారాల సహ ఇన్‌చార్జీ అభయ్ పాటిల్, పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇతర పలువురు ఇన్‌చార్జీలు హాజరయ్యా రు.
అయితే ఈ సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖైరతాబాద్ ఉప ఎన్నిక, ఇతర అంశాల కంటే కూడా ఎక్కువగా పార్టీ అంతర్గత అంశాలే ఎక్కువగా చర్చ కు వచ్చాయని తెలిసింది. నేతల పనితీరుపై ప్రశ్నలు కురిపించారట. ‘పదవులొచ్చాయి కదా అని.. కుర్చీకి అతుక్కుపోయి కూర్చుంటే కుదరదని, పైరవీలు చేసుకుని పద వులు తెచ్చుకోవడం కాదు.. పార్టీ కోసం ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పాలి’ అని ప్రశ్నించారట. కనీసం క్రియాశీల సభ్యత్వం కూడా లేని కొందరికి పదవులు రావడంపై సీరియస్ అయ్యారు. కేవలం పదవి అనుభవించడానికి మాత్ర మే వచ్చారా..? అంటూ నేతలకు నిలదీశారని తెలిసింది.
ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందే..
గత మున్సిపల్ అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల పేరుతో డబ్బు నొక్కేసిన కొందరి నేతలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జీ అభయ్ పాటిల్ సీరియస్ అయ్యారని తెలిసింది. అభ్యర్థులకు ఇవ్వాల్సిన డబ్బులు నొక్కేసిన వాళ్లపై కఠిన చర్యలు తప్పవంటూ, అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా ఉంటాయంటూ హెచ్చరించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరైతే డబ్బులు నొక్కేసారో ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని, వారిని వదిలే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు ఆ నేతల్లో కలవరపాటు మొదలైంది.
ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలా? వద్దా? ఒకవేళ ఇస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందని చర్చించుకుంటున్నారట. గతంలోనే ఈ అంశం జాతీయ నాయకత్వం దృష్టిలో ఉంది. తాజాగా మరోసారి ఈ సమావేశంలో చర్చకు రావడంతో నేతలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అభయ్ పాటిల్ వెళ్లిపోవాలని చూసిన నేతలకు జాతీయ నాయకత్వం ఈయనకే బాధ్యతలు అప్పగించడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఆ నేతలు తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
జిల్లాల్లోనే ఉండాల్సిందే..
నేతల పనితీరుపై మధుకర్ కూడా గట్టిగానే చురకలంటించారిని తెలిసింది. కొందరు జిల్లా అధ్యక్షుల పనితీరు సరిగ్గా లేదని మొహం మీదనే చెప్పినట్టు తెలిసింది. అలాగే హైదరాబాద్‌లో పార్టీ ఆఫీసు ఏసీ గదుల్లో కూర్చుంటే పార్టీ బలోపేతం కాదని, హైదరాబాద్‌కు రావొద్దని ఆదేశించినట్లు తెలిసింది. 90 శాతం మంది నేతలు గ్రామాలు, జిల్లాలు, నియోజకవర్గాలు, తమకు ఇచ్చిన బాధ్యతలు వదిలేసి హైదరాబాద్‌లోనే ఉంటున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లాలు, నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజల మధ్య పనిచేయాలని సూచించారు. స్థానిక సమస్యలు, ప్రభుత్వ హామీలు, వైఫల్యాలపై ఎవరి జిల్లాలో వారు ఉండి పోరాటాలు చేయాలని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. కార్యకర్తల మధ్య తిరగాలి.. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయకుంటే అధికారంలోకి ఎలా వస్తామంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పనిచేయని వారి పదవులు ఊడిపోతాయని వార్నింగ్ కూడా ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.