వట్టి ఆరోపణలే!

10-10-2026 | 05:30am

తమలపాకుతో నీవొకటిస్తే.. తలుపుచెక్కతో నేనొకటిస్తా..!

  1. అవినీతి ఆరోపణల చుట్టూ తెలంగాణ రాజకీయం
  2. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఆస్తులు, భూముల పోరు
  3. కాళేశ్వరం నుంచి ఎర్రవల్లి 45 ఎకరాల వరకు..
  4. టెస్సరాక్ట్ భూ కేటాయింపు, సీఎం రేవంత్ 
  5. కుటుంబంపై రూ.50 వేల కోట్ల ఆరోపణలు
  6. ఎల్ నినో ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం పాలక, ప్రతిపక్షాల మధ్య అవినీతి ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ పోరు ఇప్పుడు కేవలం విధానాలు, హామీలు, పాలనా పరమైన విమర్శలకే పరిమితం కాకుండా.. భూములు, ఆస్తులు, కంపెనీలు, ప్రభుత్వ కాంట్రాక్టులు, కుటుంబ వ్యాపార ప్రయోజనాల చుట్టూ తిరుగుతోంది. ఒకవైపు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణలు, దర్యాప్తులను ముందుకు తీసుకెళ్తుంటే.. మరోవైపు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలపై బీఆర్‌ఎస్ వరుస ఆరోపణలు చేస్తోంది.

అక్టోబర్ 9 (విజయక్రాంతి): గత కొంత కాలంగా రాష్ట్రవ్యాప్తంగా 22 ఏ నిషేధిత భూముల  జాబితా(List of lands) వివాదాస్పదంగామారిన నేపథ్యంలో ఇటీవల అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR), మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన భూములపై పలు కీలకమైన ఆరోపణలు చేశారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా భూములను ఆర్జించారని ఆరోపించారు.

దీనిపై విచారణకు సైతం ఆదేశించారు. ఈ క్రమంలోనే అటు బీఆర్‌ఎస్ నాయకులు తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ ఆస్తులు, వ్యాపార ప్రయోజనాల అంశాలను తెర పైకి తీసుకొచ్చారు. రేవంత్‌రెడ్డి కుటుంబం గత రెండేళ్లలో రూ.50 వేల కోట్లకు పైగా ఆస్తులు, వ్యాపార ప్రయోజనాలు కూడబెట్టిందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. 

అయితే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ మధ్య నడుస్తున్న తీవ్ర ఆరోపణలపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు, సాగునీరు లేక రైతుల ఇబ్బందులు, కరెంట్ కష్టాల వంటి అనేక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు పరస్పర వ్యక్తిగత ఆరోపణలకే పరిమితమవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఎర్రవల్లి భూములపైనే ఫోకస్..

తాజాగా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలోని ఎర్రవల్లి భూముల వివాదం ఈ రాజకీయ పోరును మరింత వేడెక్కించింది. ఎర్రవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 325లో అధికారిక రికార్డుల ప్రకారం 388 ఎకరాలు ఉండాల్సి ఉండగా.. ఇటీవల నిర్వహించిన సర్వేలో 343 ఎకరాలు మాత్రమే గుర్తించినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో 45 ఎకరాల భూమికి సంబ ంధించిన లెక్క తేలాల్సి ఉందని ప్రభుత్వం చెబుతోంది.

ఈ భూమి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు సమీపంలో ఉండటంతో ఆయన, కుటుంబ సభ్యుల నుంచి సంబంధిత రెవె న్యూ రికార్డులను కోరుతూ నోటీసులు ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించింది. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన భూములపై ప్రభుత్వం ఇప్పటికే పరిమితులు, ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించిన ఆరోపణలను ప్రస్తావించింది. అయితే 45 ఎకరాల వ్యవహారంలో అస లు భూమి ఎక్కడ ఉంది?

రికార్డుల్లో ఎందుకు వ్యత్యాసం వచ్చింది? అది ప్రభుత్వ భూమా? ప్రైవేటు భూమా? రికార్డుల్లో మార్పులు జరిగాయా? అనే అంశాలు పూర్తిస్థాయి రెవెన్యూ పరిశీలనలోనే తేలాల్సి ఉంది. కేసీఆర్ కుటుంబానికి మాత్రమే కాకుండా పలువురు బీఆర్‌ఎస్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులకు సంబంధించిన భూములు, ఆస్తులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తదితర నేతలకు సంబంధించిన భూ వ్యవహారాలపై రికార్డులను పరిశీలించేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

ప్రభుత్వ శాఖలు, కలెక్టర్లు, స్థానిక సంస్థల నుంచి అవసరమైన పత్రాలు, డేటా సేకరించే అధికారాలు కమిటీకి ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులు, భూము ల వ్యవహారం కూడా రాజకీయ చర్చకు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూములు, ప్రభుత్వ ఆస్తులు, ప్రాజెక్టుల విషయంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.

బీఆర్‌ఎస్ మాత్రం ఇవన్నీ రాజకీయ కక్షతో చేస్తున్న విచారణలేనని, ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు పాత అంశాలను తెరపైకి తెస్తోందని విమర్శిస్తోంది. అయితే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ము లా ఈ కార్ వంటి పలు అవినీతి కేసులు విచారణ దశలో ఉన్నాయి. తాజాగా ఈ భూముల వ్యవహారాన్ని అధికార కాంగ్రెస్ తెర పైకి తీసుకొచ్చింది. 

మీ సంగతేంటి?

కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ నేతల ఆస్తులు, భూములపై విచారణ చేపడుతున్న సమయంలో బీఆర్‌ఎస్ వ్యూహాన్ని మార్చి సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబంపై ఆస్తులు, వ్యాపార ప్రయోజనాల ఆరోపణలను తెరపైకి తీసుకొచ్చింది. సీఎం కుటుంబ సభ్యుల కు సంబంధించిన వ్యాపార సంస్థలు, పెట్టుబడులు, ఆస్తుల పెరుగుదల, కొన్ని కంపెనీల తో ఉన్న సంబంధాలను ప్రస్తావిస్తున్నది. కుటుంబ వ్యాపారాల విలువ భారీగా పెరిగిందని ఆయన ఆరోపిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు డిమాండ్ చేశారు.

ఈ అంశంపై బీఆర్‌ఎస్ రాజకీయంగా కాంగ్రెస్‌పై దాడిని మరింత తీవ్రతరం చేసింది. ఇం దులో సీఎం కుమార్తె అనుముల నైమిషా రెడ్డి పేరుతో కూడా కొన్ని వ్యాపార వ్యవహారాలను బీఆర్‌ఎస్ ప్రస్తావించింది. మైండ్ వాల్ట్ తదితర సంస్థలు, కొంపల్లి ప్రాంతంలో విద్యా సంస్థకు సంబంధించిన వ్యవహారాలపై క్రిశాంక్ ప్రశ్నలు లేవనెత్తినట్లు వార్తలు వచ్చాయి. దీనికి తోడు మెడికవర్ ఆస్పత్రి వ్యవహారంలోనూ సీఎం రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేసింది.

మొత్తంగా సీఎం కుటుంబ రూ. 50 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తున్నది. ఇదిలా ఉండగా రంగారెడ్డి జిల్లా రావిర్యాల ప్రాంతంలో సుమారు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని టెస్సరాక్ట్ సంస్థకు సుమారు రూ.7 కోట్లకు కేటాయించారని, ఆ భూమి విలువ సుమారు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఉంటుందని కేటీఆర్ ఆరోపించారు. ఆ సంస్థకు సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు అనుముల కొండల్రెడ్డితో సంబంధం ఉందని బీఆర్‌ఎస్ పేర్కొంది.

కంపెనీ మూలధనం, ఉద్యోగుల సంఖ్య, భూమి కేటాయింపు విధానం, రాయితీలపై కూడా కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. టెస్సరాక్ట్ మాత్రమే కాకుండా ప్రభుత్వ భూముల కేటాయింపులు, 22(ఏ) నిషేధిత భూముల జాబితా, ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోని భూములు, ప్రభుత్వ నిర్ణయాల ద్వారా ప్రైవేట్ సంస్థలకు ప్రయోజనం కలిగిందా అనే అంశాలను కూడా బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది.

ప్రజలకు ఒరిగేదేమిటి?

కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్‌ఎస్ పెద్దలపై, బీఆర్‌ఎస్ నాయకులు రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు, మంత్రులపై పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ వరుస ఆరోపణలపై తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీరెంత దోచుకున్నారంటే.. మీరెంత దోచుకున్నారని ఆరోపణలు చేసుకునే పాలక, ప్రతిపక్షాలకు ప్రజా సమస్యలపై పట్టింపు ఉందా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం సాధారణమే.

కానీ ప్రభుత్వ భూమి, ప్రజా ధనం, కాంట్రాక్టులు, ప్రభుత్వ సంస్థలు, ప్రజా ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారాల్లో ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని కేవలం రాజకీయ ప్రకటనలుగా వదిలేయడం వల్ల అసలు సమస్య పరిష్కారం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన భూములపై ఆరోపణలు ఉంటే.. రికార్డులు పరిశీలించి నిజం ఏమిటో తేల్చాలి.

రేవంత్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలపై రూ.50 వేల కోట్ల ఆరోపణలు వస్తే.. ఏ ఆస్తులను లెక్కలోకి తీసుకున్నారో, వాటి యాజమాన్యం ఏమిటో, వాటి విలువ ఎలా పెరిగిందో అధికారిక పత్రాలతో నిర్ధారించాలి. టెస్సరాక్ట్ భూ కేటాయింపుపై ప్రశ్నలు ఉంటే.. కేటాయింపు నిబంధనల ప్రకారం జరిగిందా? భూమి మార్కెట్ విలువ ఎంత? ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది? రాయితీకి నిబంధన ఏమిటి? సంస్థ అర్హత ఏమిటి? అనే అంశాలు బయటపెట్టాలనే డిమాండ్‌లు వస్తున్నాయి.

కేవలం రాజకీయ వేదికలపై చేసే ఆరోపణలతో కాకుండా.. రికార్డులు, దర్యాప్తులు, ఆడిట్లు, స్వతంత్ర విచారణలు, న్యాయపరమైన నిర్ణయాలే తుది సమాధానం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. కాంగ్రెస్ అయినా.. బీఆర్‌ఎస్ అయినా.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల భూమి, ప్రజల డబ్బు, ప్రభుత్వ ఆస్తుల విషయంలో ఎవరు తప్పు చేసినా బాధ్యత వహించాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే ప్రజలకు ప్రయోజనం ఉంటుందని, లేకపోతే కాంగ్రెస్ మధ్య మరో రాజకీయ ఆరోపణల యుద్ధంగా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు