ఇళ్ల తొలగింపును అడ్డుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి

06-11-2026 | 05:15pm

రామచంద్రపురం: ఓల్డ్ ఎం.ఐ.జి. శేరిలింగంపల్లి ప్రాంతంలో గత సుమారు 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేద కుటుంబాల గుడిసెలను తొలగించేందుకు రైల్వే పోలీసులు, అధికారులు, సిబ్బంది వచ్చిన విషయం తెలుసుకున్న పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి(BRS Patancheru in-charge Adarsh Reddy) వెంటనే అక్కడికి చేరుకుని తొలగింపు చర్యలను నిలిపివేయాలని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్న పేద కుటుంబాలకు ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లు చేయకుండా ఇళ్లను తొలగించడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం రైల్వే అధికారుల సమక్షంలోనే స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో ఫోన్‌లో మాట్లాడి ఈ సమస్యను వివరించారు. బాధిత కుటుంబాలకు ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లు కల్పించేలా ఎమ్మెల్యే గాంధీతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆదర్శ్ రెడ్డి తెలిపారు. అలాగే, నివాసితులకు ఇబ్బందులు కలగకుండా మానవతా దృక్పథంతో కనీసం 45 రోజుల గడువు ఇవ్వాలని రైల్వే అధికారులను కోరారు. దీనికి స్పందించిన రైల్వే సిబ్బంది 45 రోజుల గడువు వరకు వేచి ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, భాస్కర్ ముదిరాజ్, గిరి, నర్సింహ, సంపత్ గౌడ్, చిన్న, తిలావత్, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు