అభివృద్ధి పనులపై సబ్కలెక్టర్ ఉమా హారతి క్షేత్రస్థాయి పరిశీలన
- వీబీ–జీ రామ్జీ, జలసిరి పనుల పురోగతిపై ఆరా
- ఉపాధి కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ఉమాహారతి
నాగల్గిద్ద, అక్టోబర్ 14 (విజయక్రాంతి): నాగల్గిద్ద మండలంలో చేపడుతున్న వీబీ–జీ రామ్జీ పథకం(VB-G Ramji Scheme), జలసిరి పనులను బుధవారం నారాయణఖేడ్ సబ్కలెక్టర్ ఉమాహారతి(Sub-Collector Uma Harathi) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలోని నాగల్గిద్ద, శేరి దామరగిద్ద గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి పనులను సందర్శించి వాటి పురోగతిపై ఆరా తీశారు.
పనులు జరుగుతున్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోప్యానాయక్ తండాకు చెందిన ఉపాధి కూలీలతో నేరుగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అలాగే గోప్యనాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలో చేపడుతున్న జలసిరి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పనుల నిర్వహణ, పురోగతిపై ఆరా తీశారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణతో పాటు ఉపాధి పనులను సమర్థంగా నిర్వహించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ పరిశీలనలో ఎంపీడీవో మహేశ్వరరావు, ఏపీవో మురళి, ఈసీ, టీఏ సుధాకర్, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.