గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

15-10-2026 | 07:51pm

రెండు జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ,(విజయక్రాంతి): హుస్నాబాద్ నియోజకవర్గ(Husnabad Constituency) పరిధిలోని కరీంనగర్, సిద్దిపేట జిల్లాల అధికారులతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) హైదరాబాద్ సచివాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు(Bathukamma festival) పకడ్బందీ ఏర్పాట్లు పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పథకం (Employment Guarantee Scheme) కింద బతుకమ్మ ఘాట్ల వద్ద శుభ్రత, మట్టి పనులు, ఇతర అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలన్నారు.

ఏర్పాట్ల విషయంలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గంలో ALIMCO అధ్వర్యంలో ADIP పథకం కింద దివ్యాంగులు, వృద్ధులకు సహాయక పరికరాల పంపిణీ కోసం ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ప్రత్యేక శిబిరాల నిర్వహణ పై సమాచారం క్షేత్రస్థాయి వరకు చేరిందా? అనే అంశాలపై మంత్రి అధికారులను ఆరా తీశారు.

ఒక్క అర్హుడైన లబ్ధిదారుడు కూడా మిస్ కాకుండా గుర్తించి, ప్రతి ఒక్కరికీ సహాయక పరికరాలు అందేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో రెండు మండలాలకు ఒక రోజు, సిద్దిపేట జిల్లాలో మూడు మండలాలకు రెండు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. డీఆర్డీఓ, పీడీ, డీడబ్ల్యూఓలతో పాటు జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులు ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు