చెక్ బౌన్స్ కేసులకు లోక్ అదాలత్‌లో పరిష్కారం
సిద్దిపేట క్రైం, నవంబర్ 21 (విజయక్రాంతి): చెక్ బౌన్స్ కేసుల (Cheque Bounce Cases) పరిష్కారానికి శనివారం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 బెంచ్‌లను ఏర్పాటు చేసి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం (Negotiable Instruments Act) పరిధిలోని 20 చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించారు. ఈ కేసులకు సంబంధించి మొత్తం రూ.59,48,774 విలువైన వివాదాలకు పరిష్కారం లభించింది.
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో ప్రత్యేక లోక్ అదాలత్ (Special Lok Adalat) నిర్వహించారు. డీఎల్ఎస్ఏ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సుదర్శన్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సంతోష్ కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సుదర్శన్ మాట్లాడుతూ.. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బదులు లోక్ అదాలత్‌లో ఒకేసారి కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ విధానంపై న్యాయవాదులు, పోలీసులు కక్షిదారులకు అవగాహన (Legal Awareness) కల్పించాలని కోరారు. ఇరుపక్షాలకు సమయం, ఖర్చు ఆదా అయ్యేలా లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు వై.జయప్రసాద్, ఎ.కుమారస్వామి, బి.సాధన, వి.తరణి, సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రమేష్ బాబు, న్యాయవాదులు, న్యాయ సేవా సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.