జోరు కొనసాగేనా?
- నేడు విండీస్‌తో రెండో టీ20
- తుది జట్టులో మార్పులకు ఛాన్స్
- సంజూ ఫామ్‌పై ఆందోళన
- సిరీస్ సమం చేయాలని విండీస్ ఆరాటం
తొలి టీ20లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా ఇప్పుడు ఆధిక్యం పెంచుకోవడంపై ఫోకస్ పెట్టింది. బ్యాటర్లు, బౌలర్లు పూర్తి ఫామ్‌లో ఉన్న వేళ మరో ఘనవిజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. సంజూ శాంసన్ పేలవ ఫామ్ ఆందోళన కలిగిస్తుండగా తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది.
రాంఛీ, అక్టోబర్ 8: భారత్, వెస్టిండీస్ రెండో టీ20(India vs West Indies 2nd T20)కి అంతా సిద్ధమైంది. రాంఛీ వేదికగా శుక్రవారం ఈ మ్యాచ్ జరగబోతోంది. తొలి మ్యాచ్‌లో విండీస్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా ఫుల్ జోష్‌తో బరిలోకి దిగుతోంది. రాంఛీలోనూ గెలిచి సిరీస్‌లో 2 ఆధిక్యం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే భారత తుది జట్టు కూర్పులో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్ సంజూ శాంసన్ ఫామ్ కలవరపెడుతోంది. ఆసియా క్రీడల నుంచీ సంజూ నిరాశపరుస్తున్నాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 29 పరుగులే చేసాడు.
దీంతో రిజర్వ్ బెంచ్‌పై ఉన్న వైభవ్ సూర్యవంశీకి అవకాశమిస్తారా అన్నది చూడాలి. ఇటీవల హెడ్ కోచ్ గంభీర్ మాత్రం వైభవ్ కొంతకాలం వేచిచూడాల్సిందేనంటూ వ్యాఖ్యానించాడు.రెండు మూడు మ్యాచ్‌ల వైఫల్యాలకే రెండేళ్ల నుంచి ఆడుతున్న వారిని పక్కన పెట్టలేమంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు సంజూ వరుస వైఫల్యాలు ఇప్పుడు గంభీర్‌ను సైతం ఆలోచనలో పడేసినట్టు సమాచారం.
కానీ రెండో టీ20లో సంజూకు చివరి అవకాశం ఇవ్వొచ్చన ప్రచారం కూడా జరుగుతోంది. కాగా బ్యాటింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ మంచి ఫామ్‌లోకి వచ్చాడు. తొలి టీ20లో విధ్వంసకర సెంచరీతో రెచ్చిపోయాడు. ఇషాన్ కిషన్ కూడా రాణిస్తుండగా, మిగిలిన వారికి ఇంకా అవకాశం రాలేదు. అటు బౌలింగ్‌లో స్పిన్నర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కీలక సమయాల్లో వికెట్లు తీస్తుండగా, పేస్ ఎటాక్‌ను అర్షదీప్ సింగ్ నడిపిస్తున్నాడు. తొలి టీ20తో అరంగేట్రం చేసిన నమన్ ధీర్ సైతం ఆకట్టుకున్నాడు. మూడు వికెట్లతో విండీస్‌ను దెబ్బకొట్టాడు.
కాగా గత మ్యాచ్‌లో మయాంక్ యాదవ్ భారీగా పరుగులు ఇచ్చాడు. దీంతో అతని స్థానంలో ప్రిన్స్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది. మరోవైపు వెస్టిండీస్ ఒత్తిడిలో ఉంది. లక్నోలో హోప్, రూథర్‌ఫర్డ్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫలితంగా భారీస్కోరు చేస్తుందనుకున్న ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు మంచి ఆరంభాన్నివ్వలేకపోవడం విండీస్‌కు మైనస్‌గా మారింది. హెట్‌మెయిర్ కూడా నిరాశపరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు ఫామ్‌లోకి రాకుంటే మాత్రం విండీస్‌కు ఇబ్బందులు తప్పవు. అటు బౌలింగ్‌లో సైతం విండీస్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
భారత బ్యాటర్లను కరేబియన్ పేసర్లు, స్పిన్నర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. ఈ కారణంగానే టీమిండియా 14 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. దీంతో బౌలింగ్ కూడా గాడిన పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే రాంఛీ పిచ్ స్లో బౌలర్లకు అనుకూలిస్తుంది. ఆరంభంలో కంటే మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లు కీలకం కానున్నారు. ఇక్కడ రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టుకు మంచు ప్రభావం అడ్వాంటేజ్ కానుంది. గత రికార్డుల పరంగానూ ఛేజింగ్ జట్లే రాంఛీలో ఎక్కువసార్లు గెలిచాయి. ఈ నేపథ్యంలో టాస్ కీలకం కానుంది.
తుది జట్లు అంచనా
భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, నమన్ ధీర్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్
వెస్టిండీస్: కామిల్ పూరన్, షై హోప్, హెట్‌మెయిర్, రోస్టన్ ఛేజ్, రోవ్‌మన్ పావెల్, షెర్పాన్ రూథర్‌ఫర్డ్, కీమో పాల్, రొమారియో షెపర్డ్, మాథ్యూ ఫోర్డ్, అకిల్ హోస్నేన్, సమర్ జోసెఫ్