రంజీ ట్రోఫీ బరిలో జడేజా
- ఛత్తీస్‌గఢ్‌పై ఆడనున్న స్టార్ స్పిన్నర్
- కివీస్‌తో సిరీస్‌కు సన్నద్ధత
ముంబై, అక్టోబర్ 9: న్యూజిలాండ్ టూ ర్‌కు ముందు పలువురు భారత క్రికెటర్లు రంజీ ట్రోఫీ(Indian cricketers in the Ranji Trophy) ఆడేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా దేశవాళీ క్రికెట్‌లో మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న 92వ రంజీ ట్రోఫీ సీజన్ తొలి మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌తో సౌరాష్ట్ర తలపడనుంది. ఈ మ్యాచ్‌కు జడేజా అందుబాటులో ఉంటాడని సెలెక్టర్లకు తెలిపాడు.
దీంతో తాజాగా ప్రకటించిన 16 మంది సభ్యుల సౌరాష్ట్ర జట్టులో అతనికి చోటు కల్పించారు. న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు సన్నద్ధతగా ఈ రంజీ మ్యాచ్‌లు జడేజాకు ఉపయోగపడనున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27లో ఈ కివీస్ సిరీస్ భారత్‌కు ఎంతో కీలకం కానుంది. జడేజా చివరిసారిగా జనవరి 2025లో రంజీ ట్రోఫీ ఆడాడు. 2024 రంజీ సీజన్‌లో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అతను సౌరాష్ట్ర జట్టు తరఫున బరిలోకి దిగాడు.
ఆ మ్యాచ్‌లో జడేజా అద్భుత ప్రదర్శన చేస్తూ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 12 వికెట్లు పడ గొట్టి, తన కెరీర్లో 10వ సారి మ్యాచ్‌లో 10 వికెట్ల మార్కును అందుకున్నాడు. కాగా ఈ రంజీ సీజన్‌లో సౌరాష్ట్ర జ ట్టుకు సీనియర్ పేసర్ జయదేవ్ ఉనాద్‌గట్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జడేజాతో పాటు యువ పేసర్ చేతన్ సకారియా, పార్థ్ భుట్, నీల్ పాండ్యా వంటి ఆటగాళ్లు సౌరాష్ట్ర బౌలింగ్‌లో కీలకం కానున్నారు. ఎలైట్ గ్రూప్ లో ఉన్న సౌరాష్ట్ర జట్టు.. లీగ్ దశలో హైదరాబాద్, ఆంధ్ర, కర్నాటక, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, అసోం, త్రిపుర జట్లతో తలపడనుంది.