రోకో రెడీ

03-11-2026 | 05:15am

* న్యూజిలాండ్ టూర్‌లో తొలి సవాల్‌ను టీమిండియా విజయవంతంగా అధిగమించింది. టీ20 సిరీస్‌ను 3-2తో సొంతం చేసుకుంది. ఇప్పుడు ఫోకస్ వన్డే ఫార్మాట్‌కు షిప్ట్ అయింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇస్తుండడంతో అందరి చూపు ఈ సిరీస్‌పైనే ఉంది. కెరీర్‌లో చివరిసారిగా కివీస్ గడ్డపై ఆడబోతున్న రోకో జోడీ వన్డే సిరీస్‌లో చెలరేగుతుందా ?

  1. ముమ్మరంగా ప్రాక్టీస్
  2. కివీస్ గడ్డపై చెలరేగేందుకు సిద్ధం
  3. కోహ్లీకి అక్కడ సూపర్ రికార్డు

ఆక్లాండ్, నవంబర్ 2 : సుధీర్ఘమైన న్యూజిలాండ్ టూర్‌లో(New Zealand Tour) టీ20 సిరీస్(T20 Series) ముగిసింది. ఇప్పుడు వన్డే సిరీస్ కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. ఈ వన్డే సిరీస్‌లో అందరి చూపు దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే(Rohit Sharma, Virat Kohli) ఉంది. టెస్ట్, టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోకో జోడీ 2027 ప్రపంచకప్‌లో(World Cup) ఆడడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ప్రతీ సిరీస్ వీరిద్దరికీ కీలకంగానే మారింది. గత ఏడాది కాలంగా వీరిద్దరూ ఆడిన వన్డే సిరీస్‌లో అంచనాలకు తగ్గట్టే రాణించారు.

అయితే విదేశీ గడ్డపై అందులోనూ స్వింగ్ పిచ్‌లకు చిరునామాగా ఉన్న కివీస్‌లో రోకో ద్వయం ఎలా ఆడుతుందనేది ఆసక్తిగా మారింది. అనుభవం పరంగా ఇద్దరికీ ఇక్కడ మంచి రికార్డే ఉంది. అయినప్పటకీ న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్ మారిన నేపథ్యంలో రోహిత్, కోహ్లీ ఇక్కడి పిచ్‌లపై నిలకడగా రాణించడం సవాలే. దాదాపు వారం రోజుల క్రితమే ఇక్కడికి చేరుకున్న రోకో జోడీ ప్రాక్టీస్‌లో బిజీబిజీగా గడుపుతోంది.

ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్‌లో రోహిత్ శర్మ తన ట్రేడ్‌మార్క్ పుల్ షాట్లు, కవర్ డ్రైవ్లతో అలరించగా, విరాట్ కోహ్లీ తనదైన శైలిలో క్లాసిక్ డ్రైవ్స్ ఆడుతూ నెట్స్‌లో చెమటోడ్చారు. స్థానిక నెట్ బౌలర్లతో పాటు భారత యువ పేసర్లు వీరిద్దరికీ సవాల్ విసిరారు. తమ ఫామ్ కొనసాగించేందుకు ఈ సిరీస్ రోహిత్,కోహ్లీలకు మంచి అవకాశం. అలాగే 2027లో జరగబోయే వన్డే వరల్ కప్ ప్రణాళికల్లో తాము ఇంకా భాగమేనని నిరూపించుకోవడానికి ఇదే సరైన వేదిక. ఈ సిరీస్ ద్వారా భవిష్యత్తు మెగా టోర్నీలకు తమ స్థానాలను మరింత సుస్థిరం చేసుకోవచ్చు.

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ చివరి రెండు మ్యాచ్‌లలో ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న టీమిండియాకు రోకో ద్వయమే కీలకం కాబోతోంది. కాగా వన్డేలు ముగిసిన వెంటనే టెస్టు మ్యాచ్‌లు ఉండడంతో గిల్, జైస్వాల్ లాంటి ప్లేయర్లను బీసీసీఐ తొలి మూడు వన్డేలకే ఎంపిక చేసింది. విరాట్, రోహిత్ మాత్రం పూర్తి సిరీస్‌కు అందుబాటులో ఉంటారు. గిల్ గైర్హాజరీలో చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ జట్టును నడిపించనున్నాడు. భారత్ జట్టులో సీనియర్లు రోహిత్, విరాట్‌తో పాటు కెప్టెన్ గిల్, కేఎల్ రాహుల్, అయ్యర్ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు.

బౌలింగ్‌లో సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్ ఎంత మేరకు రాణిస్తారన్నది ఆసక్తి నెలకొంది.ఇదిలా ఉంటే ప్రపంచకప్ నాటికి పూర్తి జట్టును సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత హెడ్ కోచ్ గంభీర్‌పైన ఉంది. గంభీర్ ప్రణాళికల్లో రోకో జోడీ ఖచ్చితంగా ఉంటుంది. దీంతో విరాట్, రోహిత్ తాము అద్భుతంగా ఆడటంతో పాటు జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా మెరుగ్గా రాణించేలా ప్రోత్సహించాల్సిందే. కెప్టెన్ గిల్ ఇంకా అనుభవం సాధించాల్సి ఉండగా,గంభీర్‌కు హెడ్ కోచ్‌గా ఇదే తొలి వన్డే ప్రపంచకప్.

దీంతో జట్టు నిర్మాణంలో రోహిత్, కోహ్లీల అనుభవం వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక వ్యక్తిగత ప్రదర్శనలతో పాటు వన్డే సిరీస్‌ను గెలిపించడం రోకో జోడీ ముందున్న లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. మరి ఈ లక్ష్యాలను రోహిత్, కోహ్లీ ఎంతవరకు అందుకుంటారో చూడాలి. రోహిత్, కోహ్లీ ఎంట్రీతో అటు టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. 

మరిన్ని వార్తలు