దొంగ ఓటు.. అడ్డుకట్టకు రూటు!

29-10-2026 | 05:10am
  1. ఆధార్‌తో ఓటరు ఐడీ లింకింగ్‌తో సరి
  2. బయోమెట్రిక్, ఐరిస్‌తో అసలు ఓటర్‌ను గుర్తించడం తేలికే..
  3. సాంకేతికతను సక్రమంగా వినియోగించాలంటున్న నిపుణులు

సూర్యాపేట రూరల్, అక్టోబర్ 28: ఈ రోజుల్లో బ్యాంకుల్లో లావాదేవీలు జరపాలన్నా, ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, సిమ్ కార్డు తీసుకోవాలన్నా.. ఆఫీస్ లల్లో హాజరు వేయాలన్న ప్రతిదానికీ ఆధార్ కార్డు(Aadhaar Card) అనుసంధానం, మరియు బయోమెట్రిక్ తప్పనిసరి అయింది. అక్రమాలను అరికట్టడానికి, అవకతవకలను నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంది ప్రశంసించారు. డిజిటల్ భద్రత(Digital security)కు ఇది ఎంతో ఉపయోగపడుతోంది. మరి, దేశంలో ప్రజాస్వామ్యానికి పునాది అయిన ‘ఓటు హక్కు’ విషయంలోనూ ఇదే పారదర్శకత ఎందుకు తీసుకురాకూడదు? అనే ప్రశ్న ఇప్పుడు కోట్లాది మంది పౌరుల నుంచి వెల్లువెత్తుతోంది.

దొంగ ఓట్లు, అక్రమాల పర్వం.. అంతులేని గొడవలు

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. వార్తల్లో నిత్యం వినిపించే ప్రధాన సమస్యల్లో ‘దొంగ ఓట్లు‘, ‘పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు‘ ముందుంటాయి. అసలు ఓటు వేస్తున్న వ్యక్తి నిజమైన ఓటరేనా? లేక వేరే వారి పేరుతో ఎవరైనా వచ్చి ఓటు వేస్తున్నారా? అని నిర్ధారించడం పోలింగ్ సిబ్బందికి తలకు మించిన భారంగా మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో లేని వ్యక్తులు ఓట్లు వేయడం, చనిపోయిన వారి పేరిట ఓట్లు పడడం, ఒకే వ్యక్తి వేర్వేరు చోట్ల ఓట్లు వేయడం వంటి విద్రోహ చర్యలు జరుగుతూనే ఉన్నాయి అని అక్కడక్కడా ఎన్నికల వేల వింటూనేవుంటాం.

ఉదాహరణకు కేవలం 100 మంది ఓటర్లు ఉన్న ఒక బూత్లో, 110 ఓట్లు ఎలా నమోదవుతాయి? అనే విచిత్రమైన, అనుమానాస్పద పరిస్థితులు మన దేశ ఎన్నికల్లో ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ అక్రమాల వల్ల నిజమైన పౌరుల హక్కులు కాలరాచబడుతున్నాయి, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతో ంది అని అనుభవజ్ఞులు అభిప్రయపడుతున్నారు.

ఆధార్తో ఓటరు ఐడి లింక్ చేస్తే సమస్యకు పరిష్కారం

ప్రభుత్వం తలచుకుంటే ఏ పని అయినా సాధ్యమేనని గత అనుభవాలు నిరూపించాయి. బ్యాంకులు, మొబైల్ నంబర్లు, పాన్ కార్డులు.. అన్నీ ఆధార్తో అనుసంధానమైనప్పుడు, ఓటరు గుర్తింపు కార్డును  ఆధార్తో ఎందుకు లింక్ చేస్తే సరిపోతుంది కదా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

బయోమెట్రిక్, ఐరిస్ ప్రామాణీకరణ

ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో, ఆధార్తో అనుసంధానించిన వేలిముద్ర లేదా ఐరిస్  స్కాన్ ద్వారా ధృవీకరణ చేసుకునే సదుపాయం కల్పించాలని సాంకేతిక నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు బూత్ వద్ద ఉన్న పోలింగ్ అధికారికే కా కుండా, వ్యవస్థకు కూడా ఓటు వేసే వ్యక్తి అసలైన ఓటరే అని నిమిషాల వ్యవధిలో స్పష్టత వస్తుంది.ఈ విధానం అమలులోకి వస్తే, దేశంలో దొంగ ఓట్లకు శాశ్వతంగా స్వస్తి చెప్పవచ్చు. ఒకే వ్యక్తి బహుళ ఓట్లు వేయడాన్ని కచ్చితంగా అడ్డుకోవచ్చు.

సాంకేతికతను సక్రమంగా ఉపయోగిస్తే సరి..

ఈ రోజుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మన దేశంలో విస్తృతంగా అందుబాటులో ఉంది. అయినప్పటికీ, ఓటర్ల జాబితా ప్రక్షాళనలో, ఓటింగ్ ప్రక్రియలో ఆధార్, బయోమెట్రిక్ విధానాన్ని పూర్తిస్థాయిలో కఠినంగా అమలు చేయాలని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.

ప్రజాస్వామ్యాన్ని మరింత పవిత్రంగా, పారదర్శకంగా మార్చడానికి కేంద్ర ఎన్నికల సంఘం మరియు ప్రభుత్వం ఈ దిశగా గట్టి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ఆధార్, బయోమెట్రిక్ ఆధారిత ఓటింగ్ విధానం వస్తేనే నిజమైన ప్రజాస్వామ్య విలువలకు అర్థం ఉంటుంది. అప్పుడే ప్రతి పౌరుడి ఓటుకు తానే వంద శాతం వినియోగించుకునే అవకాశం దొరుకుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు, ఎన్నికల సంఘం ఈ దిశగా ఆలోచించి కఠినమైన చట్టాలు, సాంకేతిక మార్పులు తీసుకురావాలని విద్యావంతులు, మేధావులు కోరుతున్నారు.

లింక్ చేస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం..

ఎన్నికలు వస్తే మా ఊర్లో గొడవలు మాములుగా ఉండ వు. గెలిచినా వాళ్ళ సంతోషం ఓడిన వాళ్ళ అనుమానాలు, కొన్ని సార్లు దొంగ ఓట్లు వేసి గెలిచారు అని అనుమానాలతో కోట్టుకొని కేసుల వరకు వెళ్లా రు. ఇంకా మా పక్క ఊర్లల్లో ఎలక్షన్స్ అప్పుడే గొడవల వా ళ్ళ చంపుకున్న వాళ్ళు వున్నారు. ప్రతి దానికి ఫింగర్ ప్రింట్, ఆధార్ కార్డు లింక్ చేస్తుంది గవర్నమెంట్ మరి ఓట్ కి కూడా ఇదే పద్దతిలో లో చేస్తే ఆరోపణలకి తావు వుడదు కదా.. అలా చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారం.

 సీహెచ్. విజయచంద్ర,

ఎల్‌ఎల్‌బి స్టూడెంట్, సూర్యాపేట

మరిన్ని వార్తలు