బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్: బాలల హక్కుల పరిరక్షణకు(Protection of Childrens Rights) ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద(Warangal District Collector Dr. Satya Sharada) అన్నారు. శుక్రవారం ఆటోనగర్‌లోని ప్రభుత్వ బాలుర పరిశీలన గృహంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల14 నుంచి 20వ తేదీ వరకు వారం రోజులపాటు నిర్వహించిన బాలల వారోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఏటా నవంబర్ నెలలో ఐక్యరాజ్యసమితి(United Nations) చేసిన బాలల హక్కుల తీర్మానానికి గుర్తుగా ప్రపంచ బాలల దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.
పెద్దల మాదిరిగానే బాలలకు కూడా ప్రత్యేక హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు. జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కు, రక్షణ పొందే హక్కులు బాలలకు రాజ్యాంగం, చట్టాల ద్వారా కల్పించబడ్డాయని, వాటిని పరిరక్షించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పిల్లలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, పౌష్టికాహారం, తగిన రక్షణ కల్పించడంతో పాటు వారు ఆత్మవిశ్వాసంతో ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు.
అలాగే జీవితం ప్రతి ఒక్కరికీ ఎన్నో అవకాశాలను కల్పిస్తుందని, గతంలో జరిగిన తప్పులే భవిష్యత్తును నిర్ణయించవని, కృషి, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. ఒకప్పుడు దొంగగా జీవించిన రత్నాకరుడు తన జీవితాన్ని మార్చుకొని మహర్షి వాల్మీకి మారి రామాయణాన్ని రచించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన విషయాన్ని ఉదహరించారు.
కోరికలను జయించి, చెడు ఆలోచనలకు దూరంగా ఉండి, మంచి లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడే జీవితంలో నిజమైన విజేతలుగా నిలుస్తారని బుద్ధుని బోధనలను గుర్తుచేస్తూ బాలల్లో స్ఫూర్తి నింపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం సూపరింటెండెంట్ శ్రీదేవి, జిల్లా సంక్షేమ అధికారిణి రాజమణి, బత్తిని కళ్యాణి, బాలల సంక్షేమ సమితి సభ్యురాలు షాహిదా బేగం, డీసీపీయూ సిబ్బంది రాజుల సుమన్, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది సుష్మ, ఏహెచ్‌టీయూ పీసీ రామారావు, షేర్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది జన్ను ప్రభాకర్, ప్రశాంతి, కల్పన, పరిశీలన గృహం సిబ్బంది, బాలలు పాల్గొన్నారు.