క్యాన్సర్ మందుల ధరలు 70% తక్కువకు!
- ట్రేడ్ మార్జిన్‌ను 30శాతానికి పరిమితం చేసిన కేంద్రం
- బ్రాండెండ్ సహా అన్నిరకాల మెడిసిన్స్‌కు అమలు
- ఏటా రోగులకు రూ. 2,500 కోట్ల వరకు ఆదా
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: కేంద్ర ప్రభుత్వం(Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. అన్నిరకాల క్యాన్సర్ మందుల(Cancer Medicine) ధరలపై ట్రేడ్ మార్జిన్‌ను 30శాతానికి పరిమితం చేసింది. దీంతో ఆ మందుల ధరలు (ఎమ్మార్పీ) 70శాతం మేరకు తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా ఏటా క్యాన్సర్ రోగులకు దాదాపు రూ. 2,500 కోట్ల వరకు ఆదా అవుతుందని కేంద్రం అంచనా వేసింది.
ఈ నిర్ణయం బ్రాండెడ్, జనరిక్ మందులతోపాటు దేశీయంగా తయారయ్యే వాటికి, దిగుమతి చేసుకునే వాటికి కూడా వర్తిస్తుందని వెల్లడించింది. గతంలో కేవలం 42 రకాల నాన్ షెడ్యూల్ క్యాన్సర్ మెడిసిన్స్‌కు ట్రేడ్ మార్జిన్ 30శాతం పరిమితి ఉండగా.. ఇప్పుడు అన్నిటికీ దాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఔషధాల సరఫరా వ్యవస్థలో అధిక మార్జిన్లను అరికట్టి, క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌ను మరింత సులభతరం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కాగా, క్యాన్సర్ మందుల ధరలపై గత నెలలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. తయారీదారు నుంచి రిటైలర్‌కు మందులు చేరే రేట్‌కు, రోగి చెల్లించే ఎమ్మార్పీకి భారీ తేడా ఉంటున్నదని.. రోగి జేబుకు చిల్లుపుడుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజా ట్రేడ్ మార్జిన్‌ను తగ్గించింది.
ఏటా కొత్తగా 15 లక్షల క్యాన్సర్ కేసులు
దేశంలో క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఏటా కొత్తగా 15లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఈ సంఖ్యలో బాధితులు పెరిగిపోతుండటంతో వారికి చికిత్స ఖర్చులు కూడా తడిసిమోపడవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే ఎక్కువ ధర కలిగిన పేటెంట్ మందులపై దిగుమతి సుంకం, జీఎస్టీ మినహాయింపులు ఇచ్చింది.
జన ఔషది వంటి పథకం కింద మందులను అందుబాటులో ఉంచుతున్నది. 2019లో 42 రకాల నాన్ షెడ్యూల్ క్యాన్సర్ మెడిసిన్స్‌కు 30 శాతం ట్రేడ్ మార్జిన్‌ను పరిమితం చేసిన కేంద్రం ఇప్పుడు.. అన్నిటికీ వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అన్నిరకాల క్యాన్సర్ మందుల ధరలు 70శాతం మేరకు తగ్గుతాయి.