NHM ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి
ఉద్యోగుల దీక్షకు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ సంపూర్ణ సంఘీభావం
ఆలేరు,(విజయక్రాంతి): ఏళ్ల తరబడి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్ డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట NHM కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన 18వ రోజు నిరసన దీక్షకు ఆయన సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు బీజేపీ తరఫున మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా పాశం భాస్కర్ మాట్లాడుతూ.. ప్రజారోగ్య పరిరక్షణలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడంలో NHM ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించిన వైద్య సిబ్బందికి ఉద్యోగ భద్రత లేకపోవడం దురదృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు సమకూరుస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ఉద్యోగులను క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇప్పటికే 20 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉద్యోగులను ఇతర రాష్ట్రాల్లో క్రమబద్ధీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల ముందు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన హక్కులు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు: సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఏళ్ల తరబడి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. NHM ఉద్యోగులు చేస్తున్న న్యాయపోరాటానికి బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి డిమాండ్లు నెరవేరే వరకు మద్దతుగా నిలుస్తామని పాశం భాస్కర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి జైనపల్లి శ్యాంసుందర్ రెడ్డి, జిల్లా కార్యాలయ కార్యదర్శి మంగు నరసింహారావు, NHM ఉద్యోగ సంఘాల సిబ్బంది పాల్గొన్నారు.