గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల పథకాలు అందేలా కృషి
ప్రాజెక్టు అధికారి మంద మకరందు
ఉట్నూర్,(విజయక్రాంతి): జన్నారం మండలంలోని కొత్తపేట్ పొలంగూడ గ్రామాన్ని(Polamguda Village) సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మంద మకరందు(ITDA Project Officer Manda Makarandu) శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులు ప్రధానంగా రహదారుల నిర్మాణం, కల్వర్టుల ఏర్పాటు, గృహ నిర్మాణాలకు సంబంధించిన సమస్యలను ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ ప్రజలు తెలిపిన సమస్యలను ఆయన సావధానంగా విని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ప్రత్యేకంగా ప్రధానమంత్రి జన్మన్ (PM-JANMAN) పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకాల కింద అర్హులైన కుటుంబాలకు ఇళ్లు మంజూరయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే గ్రామంలో రహదారులు, కల్వర్టుల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తామని ప్రాజెక్టు అధికారి మంద మకరందు పేర్కొన్నారు.