యాదగిరిగుట్టలో అత్యంత వైభవంగా కోటి పుష్పార్చన
కార్తీక మహోత్సవాల్లో ఆధ్యాత్మిక పరిమళం
దేశ చరిత్రలోనే మొదటిసారిగా సహస్ర నామావళి సహిత కోటి పుష్పార్చన
యాదగిరిగుట్ట, నవంబర్ 20 (విజయక్రాంతి): మహిమాన్విత క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో(Sri Lakshmi Narasimha Swamy Temple, Yadagirigutta) కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి సహస్రనామావళితో కోటి పుష్పార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో(devotional) నిర్వహించారు. దేవస్థాన చరిత్రలో తొలిసారిగా కార్తీక మాస మహోత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించడం ఒక విశేషం కాగా, ఈ మహోత్సవాల్లో భాగంగా కోటి పుష్పాలతో శ్రీ స్వామివారి నామాలను స్మరిస్తూ, వేద మంత్రోచ్ఛారణల నడుమ విశేష పూజలు నిర్వహించడం మరో విశేషంగా నిలిచింది.
ఈ కార్యక్రమానికి ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Beerla Ailaiah), ధర్మకర్తల మండలి చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డి , పాలకమండలి సభ్యురాలు, విజయక్రాంతి(Vijayakraanthi) దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ విజయరాజం(Vijayaraajam), ధర్మకర్తల మండలి సభ్యులు టి. విజయేందర్ రెడ్డి , చిల్లప్ప విజయరాజం, శ్రీమతి ఈశ్వరమ్మ యాదవ్, గుండా మల్లయ్య, కే. లక్ష్మీనారాయణ శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అత్యంత వైభవంగా నిర్వహించిన కోటి పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొని సహస్రనామావళితో నిర్వహించిన పుష్పార్చనలో భక్తిశ్రద్ధలతో భాగస్వాములయ్యారు.
పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అభిషేక్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి కోటి పుష్పార్చన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సహస్రనామావళి పూజలో పాల్గొన్నారు. ప్రముఖుల రాకతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత శోభాయమానంగా మారింది. శ్రీ స్వామివారిని ఆలయం నుంచి సాంప్రదాయబద్ధంగా, అత్యంత రమణీయంగా అలంకరించిన ఊరేగింపు సేవలో మాడవీధుల గుండా వైభవంగా ఊరేగించారు. ఈ ఊరేగింపు భక్తులకు కనులవిందుగా, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. కోటి పుష్పాలతో నిర్వహించిన పుష్పార్చనలో భాగంగా మాడవీధులన్నీ పుష్పాల సుగంధ పరిమళాలతో విరాజిల్లాయి.
మరో విశేషంగా, శ్రీ స్వామివారికి సహస్రనామావళితో పూజించిన పవిత్ర పుష్పాలను దేవస్థానానికి విచ్చేసిన భక్తులు, స్థానికులు అత్యంత భక్తిశ్రద్ధలతో సేకరించారు. స్వామివారి పూజలందుకున్న పుష్పాలను పవిత్ర ప్రసాద భావనతో స్వీకరించడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు పుష్పాలను సేకరించే సమయంలో ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవశ్యంతో నిండిపోయింది. రాష్ట్రంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు వివిధ ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో దేశం, రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సంతోషంగా ఉండాలని, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు సంభవించకుండా ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని వేద పండితులు, అర్చకులు, ప్రముఖులు, పారాయణదారులు వేద మంత్రాలు, స్తోత్రాలు, బీజాక్షరాలతో శ్రీ స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించారు. దేవస్థాన ప్రాంగణమంతా వేద మంత్రోచ్ఛారణలు, శ్రీ స్వామివారి నామస్మరణతో మారుమోగి భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. కోటి పుష్పార్చన కార్యక్రమం అత్యంత భక్తిప్రపత్తులతో అద్భుతంగా నిర్వహించబడింది.కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కోటి పుష్పార్చన, స్వామివారి ఊరేగింపు సేవ, వేద పారాయణాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భక్తి సంగీత కార్యక్రమాలు యాదగిరిగుట్ట క్షేత్రానికి విశేష ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చాయి. భక్తులకు దైవదర్శనం, పుష్పార్చన, వేదఘోష, ప్రవచనాలు, భక్తి సంగీతం వంటి విభిన్న ఆధ్యాత్మిక అనుభూతులను ఒకే వేదికపై అందించడం ఈ కార్తీక మహోత్సవాల ప్రత్యేకతగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు....... సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ, సహస్రావధాని ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి మహాత్మ్యం, క్షేత్ర వైభవం, భక్తితత్వం, ఆధ్యాత్మిక విశిష్టతలను తన ప్రవచనాల ద్వారా భక్తులకు వివరించారు. ఈ ప్రవచన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో ఆలకించారు. ప్రముఖ గాయని తేలు విజయ ప్రత్యేక ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. తన మధురమైన గాత్రంతో భక్తి గీతాలను ఆలపిస్తూ శ్రీ స్వామివారి వైభవాన్ని సంగీత రూపంలో భక్తులకు అందించారు. ఈ సంగీత కార్యక్రమంతో ఆలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక సంగీత వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖులు రాజకీయ నాయకులు విద్యార్థులు యువకులు, విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు.