భవనాల్లో ఫైర్ సేఫ్టీ తప్పనిసరి

20-11-2026 | 09:54pm

హనుమకొండ,(విజయక్రాంతి): నగరంలోని పెద్ద భవనాలు, వాణిజ్య సముదయాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో అగ్నిప్రమాదాల నివారణకు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా పటిష్టమైన అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు(Fire safety arrangements) కల్పించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టీ. వెంకన్న(Greater Warangal Municipal Commissioner T. Venkanna) సూచించారు. శుక్రవారం నగరంలోని హనుమకొండ లోని డీమార్ట్, వరంగల్ లోని బిల్లా ఓపెన్ మైండ్ పాఠశాల, బాలసముద్రంలోని కళ్యాణి ఆసుపత్రి, నక్కలగుట్టలోని ఆసంత భవన్ తదితర భవనాలను కమిషనర్ సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన అగ్నిమాపక భద్రతా పరికరాలు, అత్యవసర రక్షణ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయా భవనాల్లో అగ్నిమాపక పరికరాల ఏర్పాటు, వాటి పనితీరు, అత్యవసర సమయాల్లో వినియోగించే విధానం, భద్రతా నిబంధనల అమలు తదితర అంశాలను సమీక్షించారు. అగ్నిమాపక భద్రతా అనుమతుల పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాల్లో నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయా లేదా అనే విషయాలను పరిశీలించారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి భవన యజమాని బాధ్యతని కమిషనర్ స్పష్టం చేశారు.

అగ్నిమాపక పరికరాలను కేవలం ఏర్పాటు చేయడమే కాకుండా, అవి నిరంతరం పనిచేసే స్థితిలో ఉండేలా పర్యవేక్షించాలని, అత్యవసర మార్గాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రజలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగించే వాణిజ్య సముదాయా ల్లో అగ్నిమాపక భద్రతా ప్రమణాల అమలులో నిర్లక్ష్యం వహించ రాదని తెలిపారు. కమిషనర్ వెంట బల్దియా అగ్నిమాపక భద్రతా అధికారి రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు