కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం పోయింది
కల్వకుంట్ల గోపాల్ రావు
ముస్తాబాద్,నవంబర్ 20(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం పోయిందని అందుకే ఇందిరమ్మ కుటుంబ భీమా అంటూ అన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యాలయం ముందు టెంట్లు వేసి హడావుడి చేస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మాజీ రైతు బంధు మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్ రావు విమర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు,రైతులకు కాంగ్రెస్ పై మూడేళ్ళ కాలానికే నమ్మకం పోయిందన్నారు. అందుకే ఇందిరమ్మ కుటుంబ భీమా అంటూ డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు.
అధికారంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా భీమా సౌకర్యం పని చేసే విదంగా రేషన్ కార్డు లాగా భీమా కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలన అంటున్న పాలనను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.గత ప్రభుత్వం కెసిఆర్ పాలనలో వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు 5 లక్షల రూపాయల రైతు భీమా సౌకర్యం కల్పించారని గుర్తు చేశారు.ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో కూడా రైతు భీమా చాలా మందికి వచ్చిందన్నారు.ఇప్పటి వరకు ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేపట్టక పోవడం పై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రైతులు ప్రజలు తమ ఓట్లతో కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ది చెబుతారని తెలియజేశారు.