డిసెంబర్ 29న ‘ప్రజా గర్జన – ఛలో హైదరాబాద్
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలి
సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కెచ్చెల రంగారెడ్డి.
ములకలపల్లి,నవంబర్ 20 (విజయక్రాంతి): డిసెంబర్ 29న హైదరాబాద్లో(Hyderabad) నిర్వహించనున్న ‘ప్రజా గర్జన – ఛలో హైదరాబాద్(Chalo Hyderabad)’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కెచ్చెల రంగారెడ్డి పిలుపునిచ్చారు. రాచన్నగూడెం గ్రామంలో(Rachannagudem village) శుక్రవారం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పోతుగంటి లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
మోదీ(Modi), అమిత్ షాల(Amit Shah) నాయకత్వంలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక పౌర, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ఓటు చోరీ, సంపద చోరీ, పార్లమెంట్ చోరీ, జిందగీ చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. దేశభక్తి, దైవభక్తి ముసుగులో ప్రజావ్యతిరేక, దేశద్రోహ విధానాలను అమలు చేస్తోందని మండిపడ్డారు.దేశంలోని కీలక వనరులు, ఖనిజ సంపద, ప్రభుత్వ ఆస్తులు, పరిశ్రమలను ఆదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా కట్టబెడుతోందని విమర్శించారు.
ఎల్ఐసీ, బ్యాంకింగ్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ దేశ, విదేశీ కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను అప్పగిస్తోందన్నారు.కోట్లాది మంది పౌరుల ఓట్లను తొలగించి, మరోవైపు చొరబాటుదారుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.ప్రజలు శతాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న ప్రాథమిక హక్కులు,కార్మిక, కర్షక హక్కులతో పాటు దళితులు, ఆదివాసీలు, పేదల హక్కులను హరిస్తోందన్నారు.
ప్రజలకు మాట్లాడే, ప్రశ్నించే హక్కు లేకుండా నిర్బంధ విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు, అణచివేత విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు, పౌర సమాజం పెద్ద ఎత్తున నిరసనకు సిద్ధం కావాలని కోరారు.తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, అయితే కొన్ని పథకాలను అరకొరగా అమలు చేసి మిగిలిన హామీలను విస్మరించిందని కెచ్చెల రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం విమర్శించారు.పాలనలో కాలం గడుస్తున్నా హామీల అమలులో మాత్రం నిర్లక్ష్యం కొనసాగుతోందన్నారు.
డిమాండ్ల సాధన కోసం సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 29న హైదరాబాద్లో భారీ ప్రదర్శన, బహిరంగ సభతో ‘ప్రజా గర్జన – ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.ప్రజలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, యువత, ప్రజాస్వామికవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటలకే పరిమితం కాకుండా తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు.గ్రామాల్లో మంచినీరు, పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టి కూలీలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం, జిల్లా సహాయ కార్యదర్శి నాయిని రాజు, కెచ్చెల కల్పన, అమర్లపూడి రాము, నూపా భాస్కర్, గోకినేపల్లి ప్రభాకర్, జాటోత్ కృష్ణ, మధుసూదన్ రెడ్డి, ఈసం శంకర్, మాచర్ల సత్యం, పోతుగంటి లక్ష్మణ్, కల్లూరి కిషోర్, రాచన్నగూడెం సర్పంచ్ మడకం విజయ, ఉప సర్పంచ్ వగ్గెల వెంకటేష్, నకిరికంటి నాగేశ్వరరావు, పద్దం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.