మళ్లీ దోమల దండయాత్ర!

20-11-2026 | 09:46pm
  1. బోడుప్పల్ సర్కిల్‌-10 పరిధిలో పెరిగిన దోమల బెడద
  2. సాయంత్రమైతే చాలు.. ఇళ్లలో, వీధుల్లో దోమల స్వైరవిహారం
  3. మూసీ పరివాహక ప్రాంతాల్లో మరింత తీవ్రత
  4. ఫాగింగ్ యంత్రాల వినియోగం ఏదీ?
  5. తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికుల డిమాండ్

మేడిపల్లి, నవంబర్ 20 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్‌(Boduppal Circle)-10 పరిధిలో మళ్లీ దోమల దండయాత్రతో(Invasion of the Mosquitoes) ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సాయంత్రం అయిందంటే చాలు.. ఇళ్లలో, వీధుల్లో దోమలు గుంపులుగా చేరి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని బోడుప్పల్, మేడిపల్లి, పీర్జాదిగూడ, చెంగిచర్ల డివిజన్లలో దోమల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. గత వేసవిలో ఎండల తీవ్రతతో కొంత తగ్గుముఖం పట్టిన దోమల సమస్య ప్రస్తుతం మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతాలకు సమీపంలోని మేడిపల్లి, పీర్జాదిగూడ ప్రాంతాల్లో దోమల తీవ్రత అధికంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం వేళ బయటకు వెళ్లాలన్నా, ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవాలన్నా దోమల కారణంగా సాధ్యం కావడం లేదని వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో దోమల తీవ్రత ఎంతగా ఉందంటే మాట్లాడేందుకు నోరు తెరిచినా దోమలు లోపలికి వెళ్లే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దోమల వ్యాప్తికి పారిశుధ్య లోపాలు కూడా కారణమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీలు, మురుగు కాల్వలను సక్రమంగా శుభ్రం చేయకపోవడం, మురుగునీరు నిలిచిపోవడం, కాల్వలు పొంగిపొర్లడం వంటి సమస్యలు దోమల ఉత్పత్తికి అనుకూలంగా మారుతున్నాయి. ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన గుంతలు, చెత్తాచెదారం పేరుకుపోయిన ప్రాంతాల్లో నిల్వ ఉంటున్న నీటిలో దోమల లార్వా వృద్ధి చెందుతున్నట్లు పేర్కొంటున్నారు.

ఫాగింగ్ యంత్రాలు ఎక్కడ?

దోమల నివారణ కోసం మున్సిపల్ యంత్రాంగం ఇటీవల కొత్త ఫాగింగ్ యంత్రాలను సమకూర్చినప్పటికీ వాటిని క్రమం తప్పకుండా వినియోగించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అసలు ఫాగింగ్ ఎప్పుడు నిర్వహించారో కూడా తెలియని పరిస్థితి ఉందని స్థానికులు అంటున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి యంత్రాలను సమకూర్చినా ప్రజలకు వాటి ద్వారా ప్రయోజనం అందడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఫాగింగ్‌తోనే సరిపెట్టకుండా మురుగు కాల్వల శుభ్రత, నిల్వ నీటి తొలగింపు, లార్వా నియంత్రణ, చెత్తాచెదారం తొలగింపు వంటి చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు సూచిస్తున్నారు.

వ్యాధుల భయంతో ప్రజల ఆందోళన

దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగతంగా దోమతెరలు, ఇతర రక్షణ పద్ధతులు పాటిస్తున్నప్పటికీ పరిసరాల్లో దోమల ఉత్పత్తి ఇలాగే కొనసాగితే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

అధికారులు స్పందించాలి..

బోడుప్పల్ సర్కిల్‌-10 పరిధిలో దోమల సమస్యను నియంత్రించేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బోడుప్పల్, మేడిపల్లి, పీర్జాదిగూడ, చెంగిచర్ల డివిజన్లలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించి మురుగు కాల్వల్లో పూడిక తొలగించాలని కోరుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి లార్వా నియంత్రణ చర్యలు చేపట్టాలని, అవసరమైన ప్రాంతాల్లో నిరంతరం ఫాగింగ్ నిర్వహించడంతో పాటు పారిశుధ్య పనులపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన దోమల సమస్యపై అధికారులు ఇకనైనా స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు