రైతుల వద్ద కొనుగోలు చేసే పంటలకు రసీదులు ఇవ్వాలి
ఉట్నూర్,(విజయక్రాంతి): ఆరుకాలం కష్టపడి రైతులు పండించిన పంటలను కొనుగోలు(Crop Purchases) చేస్తున్న వ్యాపారులు రైతుల వద్ద తూకం చేసిన పంటకు తగిన రసీదులు ఇవ్వడంతో పాటు రోజు వారీగా రికార్డులను నమోదు చేయాలని మండల తహసిల్దార్ ప్రవీణ్ కుమార్(Mandal Tehsildar Praveen Kumar) వ్యాపారులు ఆదేశించారు. " పత్తి కొనుగోలులో దళారుల చేతివాటం" అనే శీర్షికతో విజయ్ క్రాంతి దినపత్రికలో ప్రచురణ అయిన కథనానికి జిల్లా కలెక్టర్ రాజర్శి షా(Collector Rajarshi Shah) ఆదేశాల మేరకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వ్యాపారులకు తహసిల్దార్ వివరించారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదేశాలు సూచనలు మేరకు లైసెన్సులు పొందిన వ్యాపారులు రోజువారిగా రికార్డులను వ్రాయడంతో పాటు మార్కెట్ యార్డ్ నుండి రసీదు బుక్కులు పొంది రైతు వద్ద కొనుగోలు చేసిన పంట కు తగిన రసీదులు ఇవ్వాలని సూచనలు చేశారు. రైతులకు అందించే రసీదు కాపీని తప్పనిసరిగా అందించాలని సూచనలు చేశారు.
మార్కెట్ యార్డ్ నుండి లైసెన్సులు పొందకుండా గ్రామాలకు వెళ్లి రైతులు కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేస్తున్నవారు తప్పనిసరిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ తో పాటు ఆయా శాఖల నుండి లైసెన్సులు పొందాలని సూచనలు చేశారు. రైతులను మోసగించే వ్యాపారుల దళారుల పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇంద్రవెల్లి మండల వ్యాపారులతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కాడే ఉత్తం, మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్, మండల వ్యవసాయ శాఖ అధికారి రాథోడ్ గణేష్ లు పాల్గొన్నారు.