వృద్ధులతో విద్యార్థుల ఆత్మీయ కలయిక
ఎంపతీ ఫెస్ట్‌లో నిత్యావసర సరుకుల పంపిణీ
మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): విద్యార్థుల్లో సేవాభావం, సహానుభూతి, సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఎథిక్ అకాడమీ, కిడ్జీ స్కూల్ ఆధ్వర్యంలో 'ది ఎంపతీ ఫెస్ట్–2026' కార్యక్రమాన్ని రెడ్‌క్రాస్ ఆనందనిలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వృద్ధులకు దుప్పట్లు, బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి, వారి జీవిత అనుభవాలను తెలుసుకున్నారు. వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.
అంతేకాకుండా ఇళ్లలో ఉపయోగించకుండా ఉన్న మంచి స్థితిలోని దుస్తులు, బొమ్మలు, పుస్తకాలను సైతం స్వచ్ఛందంగా సేకరించి అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి మాట్లాడుతూ.. మంచి మార్కులు సాధించడంతోపాటు మంచి మనుషులుగా ఎదగడం కూడా విద్యలో భాగమని అన్నారు. చిన్నతనం నుంచే పిల్లల్లో పంచుకునే గుణం, మానవత్వం పెంపొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సభ్యులు మధుసూధన్ రెడ్డి, సత్యపాల్ రెడ్డి, సురభి శరత్ కుమార్, సత్యనారాయణ రెడ్డి, ఏడ్ల కిషన్, సీనియర్ న్యాయవాది నాగిరెడ్డి మల్లారెడ్డి, కిడ్జీ, ఎథిక్స్ అకాడమీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.