టీకాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి

21-11-2026 | 04:15pm

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

హాజీపూర్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్(Mancherial DMHO Dr. Narender Rathod) వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Hajipur Primary Health Center)తో పాటు గుడిపేట యూనిట్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుడిపేటలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించి, మందుల నిల్వలు, వైద్య సేవలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ... జిల్లాలో ప్రతి శనివారం గ్రామాల్లో నిర్వహించే వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి(Immunization program) ఆరోగ్య సిబ్బంది ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలన్నారు. టీకాలు వేయించాల్సిన పిల్లల వివరాలను ముందుగానే సేకరించి, ప్రతి తల్లి-శిశు సంరక్షణ కార్డులో టీకాల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఏ రోజుకు ఆ రోజు టీకాలు తీసుకున్న వారి వివరాలను నమోదు చేయాలన్నారు. ఏ టీకా ఏ వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుందో తల్లిదండ్రులకు వివరించి అవగాహన కల్పించాలన్నారు.

క్షయ, పోలియో, హెపటైటిస్, కోరింత దగ్గు, ధనుర్వాతం, నిమోనియా, తట్టు, రూబెల్లా తదితర వ్యాధుల నుంచి పిల్లలను రక్షించడంలో వ్యాధి నిరోధక టీకాలు కీలకమని తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలకు నిర్ణీత సమయంలో అన్ని టీకాలు వేయించే బాధ్యత ఆరోగ్య సిబ్బందిపై ఉందన్నారు.

అనంతరం హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. జిల్లాలో 14 రకాల వైద్య ఆరోగ్య కార్యక్రమాల్లో ఆశించిన లక్ష్యాలను సాధించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. విధులకు హాజరయ్యే సమయాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని, సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, మాతా శిశు సంరక్షణ, గర్భిణుల నమోదు, వైద్య పరీక్షలు, ఐరన్ మాత్రల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గర్భిణుల నమోదులో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే వారి వివరాలను సేకరించి వందశాతం నమోదు చేయాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఈ సంజీవని, మానసిక ఆరోగ్యం, అసంక్రమిత వ్యాధుల కార్యక్రమాల్లో భాగంగా రోగుల వివరాలు, మందుల పంపిణీ వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత పోర్టళ్లలో నమోదు చేయాలన్నారు.

30 ఏళ్లు పైబడిన వారందరికీ రక్తపోటు, మధుమేహ పరీక్షలు నిర్వహించి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. కుష్ఠు వ్యాధి బారినపడిన చిన్నారులు ఉంటే ప్రత్యేక వైద్య నిపుణులతో పరీక్షలు చేయించాలని సూచించారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, వైద్యాధికారి డాక్టర్ లహరి, ఆరోగ్య పర్యవేక్షకులు రఘుపతి, పద్మ, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు