ఇంద్రవెల్లి సంకల్ప సభను విజయవంతం చేయండి..
టిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే సభ పోస్టర్లను విడుదల చేసిన నాయకులు..
ఉట్నూర్, అక్టోబర్ 15 ( విజయక్రాంతి ): తెలంగాణ రక్షణ సమితి(Telangana Rakshana Samithi ) ( టిఆర్ఎస్ ) ఆధ్వర్యంలో నిర్వహించే పంచ జన్య సంకల్ప సభ ను ఈనెల 30వ తేదీన ఇంద్రవెల్లిలో నిర్వహించుటకు టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత నిర్ణయించారని టిఆర్ఎస్ జిల్లా శాఖ అధ్యక్షుడు రాథోడ్ బాపురావు అన్నారు.
గురువారం ఇంద్రవెల్లి మండల కేంద్రంతో పాటు కేస్లాపూర్ లోని నాగోబా ఆలయ ప్రాంగణంలో పంచ జన్య సంకల్ప సభ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు రాథోడ్ బాపూరావు, మాజీ మంత్రి బోడ జనార్ధన్ లు మాట్లాడుతూ..
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి లో నిర్వహించిన సభలో గిరిజనులకు ఇచ్చిన హామీలు మూడేళ్లు అయినా నేటికీ నెరవేరడం లేదని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి పంచ జన్య సంకల్ప సభ ద్వారా తీసుకు వెళ్లడంతో పాటు టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉమ్మడి జిల్లా ప్రజలతోపాటు గిరిజనుల కోసం చేపట్టే సంక్షేమంపై టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రజలకు వివరిస్తారని అన్నారు.
ఈ సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి పల్లె నుండి వేలాదిగా జనం తరలి రావాలని వారు కోరారు. సభ విజయవంతానికి టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి గ్రామానికి వెళ్లి సంకల్ప సభ పై ప్రజలకు వివరించాలని కోరారు. వారితోపాటు ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి మెస్రం దయానంద్, ఉమ్మడి జిల్లాలోని టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.