నేటికీ నెరవేరని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో హామీలు

18-11-2026 | 05:56pm
  1. కాంగ్రెస్ ప్రభుత్వ చేతిలో మోసపోయిన తెలంగాణ
  2. బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు దొడ్డా రమేష్

దమ్మపేట, నవంబర్ 18(విజయ క్రాంతి): తెలంగాణ ప్రజలను(People of Telangana) ఆరు గారంటీల పేరుతో మోసం చేసి మూడు సంవత్సరాలు అయిందని బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు(Former BRS Mandal President) దొడ్డా రమేష్ ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 నవంబర్ 17 న కాంగ్రెస్‌ పార్టీ అధికారమే లక్ష్యంగా ‘అభయ హస్తం’ పేరుతో ‘ఇందిరమ్మ రాజ్యం-ఇంటింటా సౌభాగ్యం’ ట్యాగ్‌లైన్‌తో ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసిందని.

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని ప్రకటించి మూడేండ్లు ఐనదని దొడ్డా రమేష్ విమర్శించారు. అలవికాని హామీలతో అరచేతిలో స్వర్గం చూపించిన కాంగ్రెస్‌ పార్టీ, ఢిల్లీ నాయకులు వచ్చి డిక్లరేషన్లు రిలీజ్‌ చేసి తాము గ్యారెంటీ అంటూ హామీల మాయను, గ్యారెంటీల గారడీలతో తెలంగాణ ప్రజలను మోసం చేశారన్నారు.

వందరోజుల్లో నెరవేరుస్తామన్న హామీలు నేటికీ అతీగతీ లేవని, మ్యానిఫెస్టో ధోకాకు మంగళవారంతో మూడేండ్లు నిండాయన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి క్యాబినెట్‌ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించి, కచ్చితంగా అమలయ్యేలా చూస్తామని నాడు హామీలిచ్చారు.

కానీ, నేటికీ ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించలేదని, కాంగ్రెస్‌ను గెలిపిస్తే హామీలను అమలు చేయించే బాధ్యత తమదేనని ఆ పార్టీ అగ్రనేతలు స్వయంగా పలుమార్లు తెలంగాణకు వచ్చి హామీలిచ్చారన్నారు. కానీ, ఇప్పుడు వారి మాటకు కూడా విలువ లేకుండా పోయిందని విమర్శించారు. ప్రజల ఆశలను పెట్టుబడిగా మార్చుకొని అధికార పీఠాన్ని అధిష్ఠించిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలును తుంగలో తొక్కిందని విమర్శించారు.

అభయహస్తం పేరుతో ఆరు గ్యారెంటీలను ప్రకటించిందని, వాటికి తోడు రైతు, యువజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ డిక్లరేషన్ల ద్వారా అనేక హామీలు గుప్పించిందన్నారు. రైతులకు రుణమాఫీ, ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం, కౌలు రైతులకు ఆర్థిక భరోసా, మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌,

గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పింఛన్లు, యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు ఇలా అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేలా హామీలు ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రకటించిందని, ఆయా పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపారని,

అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ నిజరూపం బయటపడిందన్నారు. అవన్నీ చిత్తశుద్ధిలేని హామీలని, అధికారం కోసం వేసిన గాలమని ప్రజలకు అర్థమవుతున్నదనీ, ఒకో హామీకి ఒకో మెలిక పెడుతూ కాలం వెళ్లదీస్తున్నదని దొడ్డా రమేష్ విమర్శించారు.

మరిన్ని వార్తలు