లంచం కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరెస్ట్
లంచం తీసుకునేందుకు మధ్యవర్తిగా ప్రైవేటు వ్యక్తి.. ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
పెద్దపల్లి, నవంబర్ 18(విజయ క్రాంతి): అవినీతి నిరోధక శాఖ(Anti-Corruption Bureau) (ఏసీబీ) వలకు పెద్దపల్లి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్(Public Prosecutor Donkena Ravinder) చిక్కారు. కేసులో నిందితులకు అనుకూలంగా వ్యవహరించి, సాక్షుల విచారణలో సహకరించడంతో పాటు కేసులో నిర్దోషులుగా బయటపడేలా చేస్తానని రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసి,
చివరకు రూ.1.50 లక్షలు స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రైవేటు వ్యక్తి రెడ్డిరాజుల రాజయ్యను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. బుధవారం (నవంబర్ 18) పెద్దపల్లి పట్టణంలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ నివాసంలో కరీంనగర్ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఫిర్యాదుదారుడి నుంచి మధ్యవర్తి రాజయ్య ద్వారా రవీందర్ రూ.1.50 లక్షలు లంచం స్వీకరిస్తుండగా ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ధర్మారం పోలీస్ స్టేషన్లో 2023లో నమోదైన క్రైం నంబర్ 12/2023 కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ దశలో ఉంది. ఈ కేసులో నిందితులకు అనుకూలంగా సాక్షుల విచారణకు సహకరించి, కేసులో వారు నిర్దోషులుగా బయటపడేలా చేస్తానని రవీందర్ మొదట రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు ఆ మొత్తాన్ని రూ.1.50 లక్షలకు తగ్గించినట్లు ఏసీబీ వెల్లడించింది.
లంచం సొమ్మును మధ్యవర్తి రాజయ్య ధరించిన ప్యాంటు ఎడమ జేబు నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజయ్య రెండు చేతుల వేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షల్లోనూ సానుకూల ఫలితాలు వచ్చాయి. అధికారిక హోదాను దుర్వినియోగం చేసి అక్రమ లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది.
అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్, మధ్యవర్తి రాజయ్యలను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. కరీంనగర్‌లోని అవినీతి నిరోధక శాఖ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచేందుకు చర్యలు తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉందని ఏసీబీ వెల్లడించింది.
లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.