పోలీస్‌స్టేషన్‌ సమీపంలోనే ఇసుక దందా!

14-10-2026 | 12:39pm

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలో అక్రమ ఇసుక రవాణా (Illegal Sand Transport) యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలకు టాస్క్‌ఫోర్స్‌ అధికారుల దాడులు బలం చేకూరుస్తున్నాయి. అక్రమ ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్న లారీతోపాటు జేసీబీని అధికారులు పట్టుకోవడం చర్చనీయాంశమైంది. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ వ్యవహారం సాగుతుండటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం నిఘా ఉండాల్సిన ప్రాంతంలోనే అక్రమ రవాణా జరుగుతుంటే సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం ఎందుకు అందలేదని ప్రశ్నిస్తున్నారు.

టాస్క్‌ఫోర్స్‌ రంగంలోకి దిగితేనేనా?

అక్రమ ఇసుక రవాణాను అరికట్టాల్సిన బాధ్యత స్థానిక పోలీసులతోపాటు సంబంధిత శాఖల అధికారులపైనా ఉంది. అయితే టాస్క్‌ఫోర్స్‌(Task Force) అధికారులు దాడులు నిర్వహించి వాహనాలను పట్టుకునే వరకు అక్రమ రవాణా సాగుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా జరిగే కార్యకలాపాలపై నిఘా ఎంత సమర్థంగా ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇసుక తరలింపునకు అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు విరుద్ధంగా రవాణా జరుగుతోందా? అనే అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరపాల్సి ఉంది.

నిరంతర నిఘా అవసరం

అక్రమ ఇసుక రవాణా వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతోపాటు నిబంధనల ఉల్లంఘనకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఇసుక తవ్వకాలు, నిల్వలు, రవాణాపై నిరంతర తనిఖీలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పట్టుబడిన లారీ, జేసీబీకి సంబంధించిన అనుమతులు, రవాణా పత్రాలు పరిశీలించి, అక్రమాలు నిర్ధారణైతే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అప్పుడప్పుడు జరిగే దాడులకే పరిమితం కాకుండా అక్రమ రవాణా పూర్తిగా అరికట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు